పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'పుష్ప:ది రూల్'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ను చిత్ర బృందం పంచుకుంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప ఎక్కడ?'.. అంటూ ఓ వీడియోను శుక్రవారం విడుదల చేసింది.
అయితే పుష్ప-2 టీజర్లో కథకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ అభిమానుల్లో సినిమాపై క్యూరియాసిటీని పెంచేందుకే దీనిని విడుదల చేసినట్లుగా కనిపిస్తోంది. ఈ టీజర్లో తిరుపతి జైలు నుంచి పుష్ప రాజ్ తప్పించుకున్నట్లు.. అతడిని పట్టుకోవడానికి పోలీసుల గాలింపు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయనే సీన్లను చూపించారు. మూడు నిమిషాల 14 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్లో అల్లు అర్జున్ను కేవలం రెండు షాట్లలో మాత్రమే చూపించారు. ఈ వీడియోను చూస్తుంటే 'వేర్ ఈజ్ పుష్ప' అనే అంశం చుట్టే మొత్తం సినిమా స్టోరీ నడుస్తుందా అని అనిపిస్తోంది!
'పుష్ప' సినిమాతో హీరో అల్లు అర్జున్‌కు పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయారు. ఈ సినిమా రాకముందు వరకు సౌత్ ఆడియెన్స్ మాత్రమే ఆయన సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఆయన చిత్రాల అప్డేట్స్ కోసం సౌత్ టు నార్త్ ప్రతి ఒక్క సినీ అభిమాని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా 'పుష్ప ద రైజ్'(పార్ట్-1) సినిమా సంచలన విజయం సాధించడం వల్ల.. అభిమానులు సినిమా పార్ట్-2 కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా మూవీకి సంబంధించి అప్డేట్స్ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమాపై ప్రేక్షకులకు భారీ ఆశలు పెరిగేలా చేస్తున్నారు.
పుష్ప పార్ట్-1 మంచి విజయం సాధించడంతో దీని సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా రూపొందిచేందుకు కృషి చేస్తున్నారు దర్శకనిర్మాతలు. నిర్మాణ సంస్థ కూడా ప్రాజెక్ట్‌కు సంబంధించి బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా నిర్మాణ విలువలతో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక అల్లు అర్జున్ కూడా ఈ సీక్వెల్‌తో 'పుష్ప' కన్నా హై రేంజ్లో సూపర్ హిట్ అందుకొని వరల్డ్ వైడ్‌గా తన క్రేజ్‌ను మరింత పెంచుకునేందుకు కష్టపడుతున్నారు. రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ 'మైత్రి మూవీ మేకర్స్' సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.