మనం చేసే పనిలో మంచి ఉండాలిగానీ... మనిషి కనిపించాల్సిన అవసరం లేదు.. ఇది ఓ సినిమాలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్. నిజ జీవితంలోనూ బన్నీ దీన్ని పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 'పుష్ప' సక్సెస్‌తో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. సేవాగుణంలో కూడా ముందుంటారని నిరూపించుకుంటున్నారు. ఓ పేద విద్యార్థినిని చదివించడానికి ముందుకు వచ్చి తన మంచి మనసును చాటుకున్నారు. దీంతో అభిమానుల మన్నలనను అందుకుంటున్నారు.
ఇదీ కథ.. కేరళలోని అలెప్పీలో ఓ ముస్లిం నర్సింగ్ విద్యార్థిని చదువుకు అవసరమయ్యే ఖర్చు మొత్తాన్ని భరించేందుకు సిద్ధమయ్యారు అల్లు అర్జున్. ఈ విషయాన్ని అక్కడి తెలుగు తేజం, జిల్లా కలెక్టర్ వీ ఆర్ కృష్ణ తేజ తన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తెలిపారు. అయితే సాయం అందుకున్న ఆ అమ్మాయి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు.
"ఓ ముస్లిం అమ్మాయి తాను చదువుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని కోరింది. ఆమెకు ప్లస్ 2లో పరీక్షల్లో 92 శాతం మార్కులు వచ్చాయి. అయితే గతేడాది ఆ విద్యార్థిని తండ్రి కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఆమె కళ్లలో ఆత్మవిశ్వాసం కనిపించింది్. అందుకు 'వి ఆర్ ఫర్ అలెప్పీ ప్రాజెక్ట్' ద్వారా ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందులో భాగంగానే టాలీవుడ్ యాక్టర్ అల్లుఅర్జున్‌కు ఈ విషయాన్ని తెలియజేశాం. వెంటనే సాయం చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. మూడేళ్ల పాటు కాలేజీ, హాస్టల్‌కు సంబంధించిన పూర్తి ఖర్చును భరిచేందుకు అంగీకరించారు. ఆ అమ్మాయి తప్పకుండా భవిష్యత్‌లో నర్స్ అవుతుంది. తన కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది. అలాగే సమాజం కోసం కూడా మంచి చేస్తుంది" అని కలెక్టర్ అన్నారు.