తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన, ప్రోత్సాహమిచ్చిన వారందరికీ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు ప్రముఖ నటుడు అల్లు అర్జున్. ఈ మేరకు ఓ లేఖను పోస్ట్ చేశారు. '‘నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, గురువులు, శ్రేయోభిలాషులు, చిత్ర పరిశ్రమ వారు, సినీ ప్రేక్షకులు, అభిమానులందరి ప్రేమ, ఆశీస్సుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. 40 ఏళ్లు వెనక్కి తిరిగి చూస్తే ఏదో తెలియని ఫీలింగ్. మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రయాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్' అని పేర్కొన్నారు.
40వ బర్త్డే.. భావోద్వేగానికి గురైన బన్నీ - allu arjun NEWS
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. భావోద్వేగ లేఖలను పోస్ట్ చేశారు బన్నీ.
1982 ఏప్రిల్ 8న జన్మించిన అర్జున్.. ‘విజేత’, ‘స్వాతిముత్యం’ చిత్రాల్లో బాల నటుడిగా అలరించి ‘గంగోత్రి’తో హీరోగా మారారు. ‘ఆర్య’తో మంచి గుర్తింపు పొందారు. ‘బన్నీ’, ‘హ్యాపీ’, ‘దేశముదురు’, ‘వేదం’, ‘జులాయి’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ‘అల వైకుంఠపురములో’ తదితర సినిమాలతో విశేష క్రేజ్ సంపాదించారు. ‘పుష్ప: ది రైజ్’తో పాన్ ఇండియా హీరోగా అవతరించారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబరులో విడుదలై రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం.. అర్జున్ ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’ పనుల్లో ఉన్నారు.