Allari Naresh: తాము నటించిన కొన్ని సినిమాలపై నటులకు ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఫలానా చిత్రం ఘన విజయం అందుకుంటుందని, దాంతో వాళ్ల కెరీర్ మారిపోతుందనుకుంటారు. కానీ, ఒక్కోసారి పరిస్థితులు తారుమారవుతాయి. ఇలా తనకు ఎదురైన అనుభవాన్ని అల్లరి నరేశ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన కొత్త చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ప్రచారంలో భాగంగా నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
'ఆ సినిమాతో నా రేంజ్ పెరిగిపోతుందనుకున్నా.. కానీ..'
ఎన్నో సినిమాలతో కడుపుబ్బా నవ్వించిన హీరో అల్లరి నరేశ్. ప్రస్తుతం ఆయన వైవిధ్యభరితమైన సినిమాల్లో నటిస్తున్నారు. అయితే నరేశ్ కొత్త చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ప్రచారంలో భాగంగా నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఏమన్నారంటే..?
"'నేను' అనే సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఆ చిత్రం విడుదలయ్యాక నా రేంజ్ పెరిగిపోతుందనుకున్నా. అంతగా ఈ సినిమాని నమ్మా. అది ఆశించనంత ఫలితాన్ని ఇవ్వకపోయినా మంచి జ్ఞాపకాలను మాత్రం మిగిల్చింది. ఆ సినిమా వల్లే నాకు 'గమ్యం'లో మంచి పాత్ర లభించింది. దీనివల్ల 'శంభో శివ శంభో', ఈ మూవీ వల్ల 'మహర్షి'లో నటించే అవకాశం దక్కింది.
ఇందులోని సీరియస్ క్యారెక్టర్‌ను పోషించడం వల్ల 'నాంది' కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది" అని నరేశ్ తెలిపారు. అభివృద్ధికి దూరంగా ఉండే గిరిజన ప్రాంతాల సమస్యలను 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ద్వారా తెరపైకి తీసుకురానున్నారు దర్శకుడు ఎ. ఆర్. మోహన్. ఈ సినిమాలో నరేశ్‌కు జోడీగా ఆనంది నటించింది. ఈ చిత్రం నవంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.