Itlu Maredumilli Prajaneekam: తనను ఒకప్పుడు అందరూ 'బాగా నటించావ్' అని చెప్పేవారని, ఇప్పుడు 'అందంగా ఉన్నావ్' అని అంటున్నారని నటుడు అల్లరి నరేశ్ నవ్వులు పంచారు. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. నరేశ్ హీరోగా దర్శకుడు ఏఆర్ మోహన్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం వేడుక నిర్వహించింది.
'ఒకప్పుడు 'బాగా నటించావ్' అనే వారు.. ఇప్పుడు 'అందంగా ఉన్నావ్' అంటున్నారు' - ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రలం
అల్లరి నరేశ్ హీరోగా దర్శకుడు ఏఆర్ మోహన్ తెరకెక్కించిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రీరిలీజ్ వేడుక నిర్వహించింది. ఆ సంగతులు..
నరేశ్ మాట్లాడుతూ.. "నా గత చిత్రం 'నాంది'కి పనిచేసిన వారిలో చాలామంది ఈ సినిమాకి వర్క్ చేశారు. ఈ చిత్రం విషయంలో ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి ఎక్కువ బాధ్యత తీసుకున్నారు. నేపథ్యానికి తగ్గట్టు చక్కని సెట్స్ వేశారు. ఈ సినిమా కథ సుమారు 90 శాతం అడవి చుట్టూనే తిరుగుతుంది. ఆయా లోకేషన్లను ఛాయాగ్రాహకుడు రాంరెడ్డి అద్భుతంగా షూట్ చేశారు. ఈ చిత్రం ముందు వరకు అందరూ నన్ను బాగా చేశావ్ అని చెప్పేవారు. ఈ సినిమా విషయంలో 'నువ్వు అందంగా ఉన్నావ్' అని అంటున్నారు. అలా చెబుతుంటే నాకు సిగ్గేస్తోంది. నన్ను రాంరెడ్డి అంత బాగా చూపించారు. ఏ వస్తువు కనిపిస్తే దాంతోనే స్వరాలు సమకూరుస్తాడు శ్రీచరణ్ పాకాల. హుషారైన పాటకు సంగీతం అందించాలనే తన కోరిక ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమాలో భాగమై, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. అన్ని భాషల్లో చేయదగ్గ సినిమా ఇది. దక్షిణాదిలో హిట్ అందుకున్నాక ఉత్తరాదిలోనూ ఈ సినిమాని దర్శకుడు మోహనే తెరకెక్కించాలని కోరుకుంటున్నా" అని నరేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు శ్రీవిష్ణు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తదితరులు పాల్గొన్నారు.