పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' చిత్రం కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా.. ఫస్ట్ లుక్ విడుదలైన రోజు నుంచి వివాదాల్లో చిక్కుకుందని చెప్పొచ్చు. సినీ ప్రపంచానికి 'తన్హా జీ' వంటి అత్యుత్తమ చిత్రాన్ని అందించిన ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మెగా బడ్జెట్ చిత్రంపై ప్రేక్షకులే కాదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ టీజర్ రిలీజైన తర్వాత రాముడి నుంచి హనుమంతుడి వరకు అందరి లుక్స్ పై వివాదాలు చెలరేగాయి. రావణుడిని చూసిన ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. 'ఆదిపురుష్' చిత్రానికి వ్యతిరేకంగా దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై రిప్లై ఇవ్వాల్సిందిగా సెన్సార్ బోర్డుకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు పంపించింది. కుల్దీప్ తివారీ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిల్‌పై ఇప్పటికే ఉత్తర్వులు జారీ అవ్వగా ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 21న జరగనుందని లఖ్‌నవూ బెంచ్ తెలిపింది.