Ali Tho Saradaga Vijayalakshmi: దశాబ్దానికి పైగా దక్షిణాదిని అలరించిన మహానటి.. తెలుగు తెరకు దూరమై అర్ధశతాబ్దం దాటింది. కానీ, నేటికి ఆమెను అందరూ గుర్తుంచుకున్నారంటే కారణం ఎన్నో మరపురాని చిత్రాల్లో ఆమె పోషించిన అత్యద్భుతమైన పాత్రలే. నటనతోనే కాకుండా నాట్యంతోనూ చిత్ర చరిత్రలో చెరిగిపోని సంతకాన్ని చేసిన లెజండరీ నటి ఎల్.విజయలక్ష్మి ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆలీతో సరదాగాలో అలనాటి ముచ్చట్లను పంచుకున్నారు. అవన్నీ ఆమె మాటల్లోనే...
ఎన్టీఆర్ మిమ్మల్ని ఏమని పిలిచేవారు ?
ఎల్.విజయలక్ష్మి: "ఆయన నన్ను కోడలా.. అని పిలిచేవారు. నర్తనశాల సినిమాలో కోడలుగా చేశా. ఆ తర్వాత ఎప్పుడు చూసినా కోడలా.. కోడలా.. అని పిలిచేవారు. ఇప్పటివాళ్ల డ్యాన్స్ నేను చూడలేదు. ఐశ్వర్యారాయ్, మాధురీ దీక్షిత్‌ల డ్యాన్స్ నాకు ఇష్టం. అలాగే సాయిపల్లవి డ్యాన్స్ బాగా వేస్తుందని చెప్పారు. నేను ఎప్పుడూ చూడలేదు".
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూశారా ?
ఎల్.విజయలక్ష్మి:"ఇంకా లేదు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బాగుందని అందరూ చెబుతున్నారు. టైం ఉన్నప్పుడు ఆ సినిమా చూడాలి. తమిళ మూవీలో భాంగ్రా డ్యాన్స్ వేయాలి. ఆరోజుల్లో ఆ డ్యాన్స్ ఎవరికీ తెలీదు. ఎమ్‌జీ రామచంద్రన్ గారు నాతో డ్యాన్స్ చేయాలంటే నేర్చుకోవాలి అని నెల రోజులు నేర్చుకున్నారు."
గుండమ్మకథ రిలీజ్ టైమ్‌కు చివరి నిమిషంలో మీ సాంగ్ రికార్డు చేసి పెట్టారట?
ఎల్.విజయలక్ష్మి: అవును. గుండమ్మకథలో పద్మ అనే పాత్రలో నేను నటించాను. విడుదలయ్యే సమయానికి విజయలక్ష్మి సినిమాలో ఉండి.. ఆమె డ్యాన్స్ లేకుంటే ఎలా అన్నారు. అప్పటికప్పుడు కేవలం మ్యూజిక్ మాత్రమే పెట్టి నాతో డ్యాన్స్ చేయించారు.
రామారావు, నాగేశ్వరరావు నుంచి ఏమి నేర్చుకున్నారు ?
ఎల్.విజయలక్ష్మి:రామారావు గారితో 15 సినిమాల్లో చేశా. నాగేశ్వరరావుతో 6 సినిమాలు చేసినట్లున్నా. రామారావు గారు ఒక నిఘంటువని చెప్పొచ్చు. ఆయన షూటింగ్‌లకు కచ్చితంగా సమయానికి వచ్చేవాళ్లు. ఉదయం 7 గంటలకు షూటింగ్ మొదలు అంటే ఆ టైంకి అక్కడ ఉంటారాయన.
నేను క్రమశిక్షణ ఆయన నుంచే నేర్చుకున్నా. పనిపై ఆయనకు ఉన్న శ్రద్ధ. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు ఆ తర్వాత నాకు చదువుకోవడంలోనూ ఉపయోగపడ్డాయి. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు కెమెరా ముందు ఒకలా ఉండేవారు. కెమెరా ఆపేశాక జోకులు వేస్తారు. చాలా సరదాగా ఉండేవారు.
ఈ మధ్య కాలంలో ఏవైనా కొత్త సినిమాలు చూశారా ?
ఎల్.విజయలక్ష్మి:లేదు. నాకు సినిమాలు చూసేంత టైం ఉండదు. అప్పుడెప్పుడో బాలకృష్ణ సినిమా చూశా. తర్వాత చిరంజీవిది. తాజాగా అయితే పుష్ప చూశాను.(మధ్యలో ఆలీ మాట్లాడుతూ.. పుష్పలో హీరో అల్లురామలింగయ్య మనవడు అని చెప్పారు). ఈరోజుల్లో ఎవరినీ అడిగినా ఈ హీరో ఫలనా వాళ్ల చుట్టాలనే అంటున్నారు(నవ్వుతూ). ఈ తరం నటీనటులు చాలా కష్టపడుతున్నారు. హ్యాట్సాఫ్ చెప్పాలి.