Nasa praises on Balakrishna 369 movie: వైవిధ్య చిత్రాలను ప్రేక్షకులకు చూపించాలని తపన పడే దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన క్లాసిక్ మూవీ 'ఆదిత్య 369'. సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ, చరిత్ర ఈ మూడింటిని మేళవించి తెరకెక్కిన చిత్రమిది. అప్పట్లో ఈ మూవీ టాలీవుడ్‌లో సంచలనాలు సృష్టించి.. తెలుగు సినిమాకు ఒక మైలురాయిగా నిలిచింది. అయితే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సింగీతం శ్రీనివాసరావు.. ఆదిత్య 369 సినిమాను బాలకృష్ణతోనే ఎందుకు తీశారు? 'ఆదిత్య 369' అనే టైటిల్ ఎందుకు పెట్టారు? ఈ సినిమాను చూసిన నాసా ఏమని ప్రశంసించింది? ఈ చిత్రం సీక్వెల్.. వంటి విషయాలు గురించి మాట్లాడారు.
"బాలకృష్ణ మూడు చిత్రాలు చేశాను. ఆదిత్య 369 విషయానికొస్తే.. భవిష్యత్, వర్తమానం ఎవరైనా చేస్తారు. గతంలోకి వెళ్లాలంటే ఇంట్రెస్టింట్ టాపిక్ తీసుకోవాలి. ఓ కథగా, జనరంజికంగా ఉండాలంటే రెండే రెండు కాలాలు ఉన్నాయి. ఒకటి శ్రీకృష్ణదేవరాయలు, అక్బర్ కథ. ఇలాంటి కథలు బాలకృష్ణ అయితేనే కరెక్ట్. అలా శ్రీకృష్ణదేవరాయలను ఎంచుకుని బాలకృష్ణను తీసుకున్నాను" అని సింగీతం అన్నారు.
నాసా ప్రశంసలు.."ఇక్కడి వాళ్లు నాసాలో ఉన్నారు. ప్రపంచంలోనే ఉన్న టైమ్ మెషీన్ సినిమాలన్నింటినీ చూశారు. అందులో ఆదిత్య 369 అనేది పర్ఫెక్ట్ టైమ్ మెషీన్ అని కితాబిచ్చారు. నాకు కాలేజ్ డేస్ నుంచి సైన్స్ ఫిక్షన్ అంటే ఇంట్రెస్ట్. కానీ సైన్స్, టెక్నాలజీ అంతా తెలిసి చేయలేదు. కానీ బాగా వచ్చింది. అందుకే వాళ్లు నన్ను ప్రశంసించారు" అని సింగీతం పేర్కొన్నారు.