దాదాపు 1500 చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు చలపతిరావు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆయన నటనపై ఉన్న ఆసక్తితో ఎన్నో నాటకాలు వేసి.. ఎన్టీఆర్ చొరవతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 'కథానాయకుడు'తో మొదలైన ఆయన నట ప్రస్థానం.. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్‌హీరోల సినిమాలతో సుదీర్ఘంగా కొనసాగింది. తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను గతంలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన పంచుకున్నారు. ఆయన హఠాన్మరణంతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన గతంలో పంచుకున్న విశేషాలు ఓ సారి చూద్దాం.
ఈవీవీ తీసిన 'మా నాన్నకు పెళ్లి' సినిమా కథ నా లవ్ స్టోరీనే: చలపతిరావు
సుమారు 1500 చిత్రాల్లో నటించి సినీ ప్రియులను అలరించిన ప్రముఖ నటుడు చలపతిరావు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను గతంలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన పంచుకున్నారు. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన 'మానాన్నకు పెళ్లి' సినిమా కథ తన లవ్‌స్టోరీనే తెలిపారు. ఆ విశేషాలు.
ప్రేమ కథ..!
"పీయూసీ చదువుకునేందుకు కొన్నాళ్లు బందరులో ఉన్నాను. అక్కడ నా లవ్‌స్టోరీ మొదలైంది. తను నా క్లాస్‌మేట్. చాలా మంచి అమ్మాయి. నాలో ఏం చూసిందో తెలియదు కానీ, ఒక రోజు నా దగ్గరకు వచ్చి, 'పెళ్లి చేసుకుంటావా'అని అడిగింది. అప్పటికి నాకు 19ఏళ్లు. 'నీకు ఇష్టమా' అని అడిగా. 'సరే'నంది. వెళ్లి పెళ్లి చేసుకున్నాం. ఇంట్లో తెలియదు. ఎందుకంటే నాకు అన్నయ్య ఉన్నాడు. సాధారణంగా పల్లెటూళ్లలో పెద్దవాళ్లకు చేయకుండా చిన్నవాళ్లకు ముందు పెళ్లి చేయరు. అలాంటిది నాకు పెళ్లయిందని తెలిసి మా అన్నయ్య ఏడవటం మొదలు పెట్టాడు. ‘తమ్ముడికి పెళ్లయింది. నాకు ఇక పిల్లను ఎవరు ఇస్తారు’ అని అంటుండేవాడు. దాంతో నేనే వాడికి సంబంధం చూసి పెళ్లి చేశా. ఆ తర్వాత మేము బెజవాడలో కాపురం పెట్టాం. అప్పటికి నేను ఇంకా చదువుతూనే ఉన్నా. అయితే నాటకాలు వేసేవాడిని. ‘తస్మాత్ జాగ్రత్త’ అనే నాటకం వేస్తుంటే హీరోయిన్‌గా చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో మా ఆవిడినే హీరోయిన్‌గా చేయించా. ఏకంగా ఉత్తమనటిగా అవార్డు దక్కించుకుంది. ఆ తర్వాత ఇద్దరం కలిసి మద్రాసు వెళ్లిపోయాం. ఈవీవీ సత్యనారాయణతో నాకు మంచి అనుబంధం ఉంది. నా జీవితంలో జరిగిన సంఘటనలను రెండు, మూడు సినిమాలు తీశారు. ఆయన తెరకెక్కించిన 'మానాన్నకు పెళ్లి' నా కథే"
మళ్లీ పెళ్లి చేసుకోమన్నారు..!
"నా భార్య అనారోగ్యంతో చనిపోయింది. అప్పటికి రవికి ఏడేళ్లు. పెద్దపాపకు నాలుగు, చిన్న పాపకు మూడేళ్లు. ఆ వయసులో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. 'మళ్లీ పెళ్లి చేసుకోవాలా? చేసుకుంటే ఏమవుతుంది. వచ్చే ఆవిడ చూస్తుందో?లేదో?' ఇవే ఆలోచనలు. మళ్లీ పెళ్లి చేసుకోమని ఎన్టీఆర్-తారకమ్మ కూడా చెప్పారు. 'ఇప్పుడు బాగానే ఉంటుంది. పెద్ద వయసులో నీకు అండగా ఎవరూ ఉండరు' అని అన్నారు. అప్పుడు బాగా ఆలోచించి ఒకటే నిర్ణయం తీసుకున్నా. ‘ఉంటే పిల్లలు నాతో ఉంటారు. లేకపోతే నాతో చచ్చిపోతారు. అయితే వీళ్లను బాగా చదివించాలి’ అనుకున్నా. చదువు విషయంలో నేనెప్పుడూ మా పిల్లలను ఒత్తిడి చేయలేదు. ముగ్గురూ చదువుకున్నారు. గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి. చిన్నప్పటి నుంచి వాళ్లకు ధైర్యం చెప్పేవాడిని. అమరచిత్ర కథలు చదివించేవాడిని. ఆడపిల్లలు ఇద్దరూ అమెరికాలో ఉంటున్నారు. అలాగే రవికి పెళ్లి చేసి పంపించేశా. స్వతంత్రంగా ఎలా బతకాలో వాళ్లకు తెలిసొచ్చింది"