Ali Tho Saradaga Fariya Abdullah: 'చిట్టి నీ నవ్వుంటే లక్ష్మీ పటాసే' అంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. తొలి చిత్రం 'జాతి రత్నాలు'లో తన నటనతో సినీ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత 'బంగార్రాజు' మూవీలో ఐటమ్ సాంగ్తో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఇలా తక్కువ సమయంలో హీరోయిన్గా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ... తాజాగా హీరో సంతోష్ శోభన్తో 'లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్'లో నటించింది. ఈటీవీలో ప్రసారమయ్యే ప్రముఖ సెలబ్రెటీ టాక్ షో 'ఆలీతో సరదాగా'కు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది.
చిట్టితో క్యాబ్ డ్రైవర్ ప్రేమ కథ!
ఈ సందర్భంగా ఓ ఫన్నీ ఇన్సిడెంట్ను ఫరియా షేర్ చేసుకుంది. "ఒకసారి నేను క్యాబ్లో వెళ్తున్నప్పుడు మాస్క్ ఉండడం వల్ల నన్ను ఆ క్యాబ్ డ్రైవర్ గుర్తుపట్టలేకపోయాడు. కానీ అతడు చాలా బాధలో ఉన్నాడు. ఏమైందని అడిగితే కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా సౌండ్ వస్తుందని చెప్పాడు. మీ కారు కోపంలో ఉందని నేను చెప్పా. మీరు ఎవరికైనా కారు ఇచ్చారా? అని అడిగా. అవును అన్నాడు. ఎప్పుడైనా క్యాబ్లో ఒంటరిగా వెళ్తే డ్రైవర్తోనే అలా మాట్లాడుతుంటా. ఆ సంభాషణలో తన కారు పేరు చిట్టి అని చెప్పాడు. ఎందుకు ఆ పేరే పెట్టారని అడిగితే తన చిన్నప్పుడు క్రష్ పేరు చిట్టి.. అందుకే పెట్టాను అని అన్నాడు. వెంటనే నేను నా పేరు కూడా చిట్టి అన్నా. ఒక్కసారిగా నన్ను గుర్తు పట్టి చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఒక్క సెల్ఫీ అడిగితే ఇచ్చా."
సూపర్ మార్కెట్లో చోరీ కథ..
ఓ సూపర్ మార్కెట్లో దొంగతనం చేశావంట కదా అని అలీ అడగ్గా.. ఆమె ఇలా సమాధాన మిచ్చింది."చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి అనుకున్నాం. సూపర్ మార్కెట్కు వెళ్లి చిప్స్ పాకెట్స్, చాక్లెట్స్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకుని వచ్చేద్దాం అనుకున్నాం. నేను చాక్లెట్ తీసుకుని వచ్చేశాను. మా ఫ్రెండ్స్ దొరికిపోయారు. "