Alitho saradaga Kota Srinivasarao Birthday: ప్రతినాయకుడిగా.. మధ్య తరగతి తండ్రిగా.. అల్లరి తాతయ్యగా, అవినీతి నాయకుడిగా, హత్యలు చేసే గుండాగా.. కామెడీ విలన్‌గా.. ఇలా విభిన్నమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా వెండితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు కోట శ్రీనివాసరావు. సామాన్యుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి గొప్ప నటుడిగా తెలుగువారికి చేరువయ్యారు. నటన మీద ఉన్న ఆసక్తితో ఏడు పదుల వయసులోనూ స్క్రీన్‌పై అడపాదడపా చిత్రాల్లో కనిపిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆయన తాజాగా ఆలితో సరదాగా కార్యక్రమంలో పాల్గొని తన కెరీర్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇందులో భాగంగానే నిర్మాత రామానాయుడుతో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు.
నిర్మాత రామానాయుడు చాలా సందర్భాల్లో 'కోటా గొప్ప నటుడు' అని చెప్పేవారు. మీ మధ్య ఏదైనా సరదా సంఘటన జరిగిందా? అని ఆలీ అడగగా.. ఇలా చెప్పుకొచ్చారు.
" 'అహ నా పెళ్లంట' సినిమా అప్పటికీ ప్రారంభంకాలేదు. ఓ రోజు నేను చెన్నై వెళ్లడానికి ఎయిర్పోర్ట్ వెళ్లా. అప్పటికే అక్కడ రామానాయుడు ఉన్నారు. ఆ రోజుల్లో ఆయనతో మాట్లాడమంటే పెద్ద గొప్ప. దూరంగా కూర్చొన్ని నమస్కారం చెప్పాను. అప్పుడు నన్ను 'ఇటు రావయ్యా' అన్నారు. పక్కకు వెళ్లి కూర్చున్నా. 'జంధ్యాలతో ఓ సినిమా ప్లాన్ చేశాను. అందులో ఓ పాత్ర ఉంది. ఆ క్యారెక్టర్ పండితే సినిమా చాలా బాగా ఆడుతుంది. లేదంటే యావరేజ్ అవుతుంది. ఆ పాత్రను రావుగోపాల్రావుతో వేయిద్దాం అనుకున్నా. కానీ ఆయన నీ పేరు చెబుతున్నారు. 20 రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఇక నువ్వే వేషం వేయాలి. వేస్తున్నావు. 20 రోజులు డేట్స్ కావాలి' అన్నారు.