చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి హాస్య నటుడిగా, హీరోగా వెయ్యింకి పైగా చిత్రాల్లో నటించిన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు కమెడియన్ అలీ. అంతేకాదు ఆలీతో సరదాగా షోతో వ్యాఖ్యాతగానూ బుల్లితెరపై చెరగని ముద్రవేశారు. అయితే ఆయన్ను కలవడం కోసం ఓ స్టార్ డైరెక్టర్ సైకిల్ యాత్ర చేశారు! ఆ విషయాన్ని అలీనే స్వయంగా చెప్పారు. దీంతో పాటే మరిన్ని విశేషాలను తన ఆలీతో సరదాగా కార్యక్రమానికి తానే గెస్ట్‌గా వచ్చి తెలిపారు. ఆ సంగతులు..
బాగా నచ్చిన సెలబ్రిటీ.. బాల సుబ్రహ్మణ్యంగారు, పూరిజగన్నాథ్, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, మోహన్‌బాబు, బ్రహ్మానందం ఇలా గొప్ప నటులు, దర్శకులని ఆలీతో సరదాగాలో ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం నా అదృష్టం. మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల నాకు ఈ అవకాశం లభించింది. నేను మంచి చేస్తే.. అది నా పిల్లలకు వస్తుంది.
నర్సీపట్నం నుంచి అనకాపల్లి.. పూరి జగన్నాథ్ నన్ను కలవడం కోసం నర్సీపట్నం నుంచి అనకాపల్లికి వచ్చేవారు. నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం షోలే సినిమా. అందులో అంజాద్‌ఖాన్ చూసి షాకయ్యా. ఆయన కోసమే వంద సార్లు చూశా. షోలే స్క్రీన్‌పై వేసి, మ్యూట్ పెట్టేస్తే.. అందరి డైలాగ్‌లు చెప్పేస్తా. అయితే నా కామెడీ అంటే పూరికి చాలా ఇష్టం. ఆ తర్వాత పూరి జగన్నాథ్ సినిమాల్లో ప్రత్యేకంగా నాకోసం కామెడీ ట్రాక్‌లు రాశారు. నేను పని చేసిన ఎక్కువమంది దర్శకుల్లో పూరి ఒకరు.
అంతా స్వామీజీ అనుకున్నారు.. దేశముదురు సినిమా సమయంలో స్వామీజి వేషం వేసుకుని.. వేరే స్వామీజీ పక్కన కూర్చొంటే ఆయనకు నాకూ దండం పెట్టారు. గెటప్ తీసేసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. ఆ క్యారెక్టర్‌కు మంచి పేరు వచ్చింది. పూరితో చేసిన రెండు సినిమాలకు నాకు రెండు ఫిల్మ్‌ఫేర్‌లు వచ్చాయి.
బర్మా నుంచి ఇక్కడికి..రెండో ప్రపంచ యుద్ధంలో సమయంలో మా నాన్నను తీసుకుని నాయనమ్మ బర్మా నుంచి ఇక్కడకు వచ్చేశారు. ఆమె అరబిక్ టీచర్. మా తండ్రి మేనమామ టైలర్. మనిషిని చూసి, కొలతలు నోటితో కొలిచి, డ్రెస్ కుట్టగల సమర్థుడు మా నాన్న. సూట్‌లు, భరతనాట్యం డ్రెస్‌లు కుట్టేవారు. అమెరికా నుంచి కూడా వచ్చి మానాన్న దగ్గర భరతనాట్యం డ్రెస్‌లు కుట్టించుకునేవారు. వాళ్లు తీసుకు వచ్చిన క్లాత్ మిగిలిపోతే మాకు ఫ్రీగా ఇచ్చేవారు. ఆరోజుల్లో భరతనాట్యం డ్రెస్ కుట్టాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భంగిమ అన్నప్పుడు డిజైన్ చేసిన క్లాత్ వేలాడుతూ కనిపించాలి. ఆ క్లాత్ అలా రావడానికి దాదాపు పదిరోజులు ఇస్త్రీ చేయాల్సి వచ్చేది. ఆ పని నేను చేసేవాడిని. ఎన్టీఆర్ సినిమా చూడాలంటే నాన్న ఈ పని చెప్పేవారు. అందుకు రూపాయి ఇచ్చేవారు. దాంతో సినిమా చూసేవాడిని. ఆ రోజుల్లో ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే, జనాలు విపరీతంగా వచ్చేవారు. పురుషుల క్యూ అసలు ఖాళీ ఉండేది కాదు. మహిళల క్యూ దగ్గరకు వెళ్లి మూగవాడిగా నటించి, టికెట్లు సంపాదించేవాడిని. మా తండ్రిగారి మేనమామకు పిల్లలు లేకపోవడంతో ఆయన ఆస్తులను మా నాన్న పేరుమీద రాశారు. అది కొంతమంది చుట్టాలకు నచ్చలేదు. దీంతో ఒకరోజు ఇంటి బయట నిద్రపోతున్న సమయంలో వచ్చి దాడి చేశారు. ఆ దాడిలో నాన్న చనిపోయాడనుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎలాగో బతికారు. ఆస్తి కోసం నన్ను చంపాలనుకున్నారు కదా. ఈ ఆస్తి నాకు వద్దు అని కట్టుబట్టలతో మచిలీపట్నం నుంచి రాజమండ్రి వచ్చేశారు. హనుమంతరావు అనే హెడ్ కానిస్టేబుల్ మా నాన్నకు స్నేహితుడు. ఆయన ఒక మెషీన్ అద్దెకు ఇప్పించారు. ఆ తర్వాత నెమ్మదిగా మా నాన్న రెండు మెషీన్లు కొని, పనివాళ్లను పెట్టుకుని బట్టలు కుట్టేవారు. మేం మొత్తం ఏడుగురు సంతానం. మా పెద్ద అక్కకు పెళ్లి చేసిన తర్వాత ఒక బాబు పుట్టాడు. రెండోసారి కడుపుతో ఉండగా, పిల్లవాడి కోసం పాలు కాస్తూ చీర కొంగుకు నిప్పు అంటుకుని ఒళ్లు కాలిపోయింది. ఆ సమయంలో మంటలు ఆర్పేందుకు ఒక వ్యక్తి నీళ్లు పోయడంతో కాలిన గాయాలకు ఇన్‌ఫెక్షన్ సోకి అక్క, ఆమె కడుపులో ఉన్న బిడ్డా ఇద్దరూ చనిపోయారు. దీంతో మా తండ్రి డీలా పడిపోయారు. మా అమ్మ ధైర్యం చెప్పి పనికి పంపారు. ఆ తర్వాత నాన్న చెన్నై వెళ్లి సర్కస్ వాళ్లకు బట్టలు కుట్టడం మొదలు పెట్టారు.
అలా సినిమాల్లోకి.. ఇంట్లో తిడితే చెన్నై పారిపోయి, ఆలీ నటుడు అయ్యాడని అప్పట్లో పేపర్‌లో రాసేవారు. కానీ, అది నిజం కాదు. మా నాన్న స్వయంగా షూటింగ్‌లకు తీసుకెళ్లేవారు. ఆయన చెన్నైలో సర్కస్ వాళ్లకు బట్టలకు కుట్టేవారు. అయినా ఫ్యామిలీ రాజమండ్రిలో ఉండటంతో చెన్నైలో ఎక్కువ రోజులు ఉండేవారు కాదు. నన్ను అక్కడ ఎవరో ఒకరికి అప్పగించి వెళ్లిపోయేవారు. షూటింగ్ అయిపోయిన తర్వాత నేను సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి రాజమండ్రి వచ్చేవాడిని. దాదాపు ఎనిమిదేళ్ల పాటు బాలనటుడిగా నటించా. నా మొదటి సినిమా సీతాకోకచిలుక అని చాలా మంది అనుకుంటారు. కానీ అది కాదు. ఏడో సినిమా అది. నా తొలి సినిమా పునాదిరాళ్లు. ఈ సినిమా తీసిన వాళ్లు మా బంధువులు. రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుండగా.. మా నాన్న నన్ను తీసుకెళ్లారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నన్ను కూడా సినిమాలో పెట్టారు. అది నేను నటించిన తొలి చిత్రం. చిన్నప్పటి నుంచి మిమిక్రీ చేసేవాడిని. శ్రీపాద జిప్‌మోహన్ మిత్ర మా గురువు. ఆయన ఆర్కెస్ట్రాలో మిమిక్రీ చేసేవాడిని.
ఇదీ చూడండి:ఈ నేచురల్ బ్యూటీ కథలో రాజకుమారి