Ali Tho Saradaga Vakkantham Vamsi: తెలుగుతెరపై స్క్రీన్ రైటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు వక్కంతం వంశీ. ఎక్కువగా సురేందర్ రెడ్డి సినిమాలకు వంశీ కథలు అందించారు. ఆ తరువాత మెగా ఫోన్ పట్టుకొని దర్శకుడిగాను అదృష్టం పరీక్షించుకున్నారు. తాజాగా ఈ స్టార్ రైటర్ తన భార్య శ్రీవిద్యతో కలిసి ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' సెలబ్రెటీ టాక్ షోకు ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హీరో అల్లుఅర్జున్‌తో 'నాపేరు సూర్య' సినిమా చేసే అవకాశం ఎలా వచ్చిందో వివరించారు.
"దర్శకుడిగా సినిమా తెరకెక్కించాలని ఐదేళ్లుగా నేను సిద్ధమవుతున్నాను. చెప్పాలంటే 'నాపేరు సూర్య' సినిమా తారక్‌తో చేయాల్సింది. ఆయనే నన్ను డైరెక్టర్‌గా చేస్తానన్నారు. తన కోసమే కథ రాసుకున్నా. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై సినిమా తెరకెక్కాలి. కథ విషయంలో కాస్త ఇబ్బంది వచ్చింది. అలా ఆ కథ పక్కన పెట్టా. ముందు ఏదో సినిమా ఒకటి చేద్దామని ఆ తర్వాత మళ్లీ రాశాను. అదే సమయంలో బన్నీ కోసం రేసుగుర్రం సినిమా కోసం స్టోరీ రాస్తున్నాను. అలా బన్నీతో పరిచయం ఉండడంతో నాపేరు సూర్య కథ ఆయనకు చెప్పా. వెంటనే ఆయన ఓకే చెప్పారు."