Ali Tho Saradaga Radhika: రాధిక శరత్‌కుమార్.. సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. 1980లో తెలుగు తెరపై సందడి చేసిన ప్రముఖ కథానాయికలలో ఆమె ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అప్పట్లో స్టార్ హీరోలు అందరితోనూ రాధిక సినిమాలు చేసి మెప్పించారు. ఆ తర్వాత టీవీ సీరియల్స్‌తోనూ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఇటీవలే రాధిక.. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి ఆమె చెప్పారు. ఇక తాను ఓ దర్శకుడిని చూసి హంతకుడు అనుకుని భయపడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.
"అప్పుడు మేము ఉండే ఏరియాలో పెద్ద మర్డర్ జరిగింది. ఆ సమయంలోనే ఓ రోజు భారతీరాజా మా ఇంటికి వచ్చారు. నేను అతడే హంతకుడు అనుకుని.. లోపలికి రావొద్దని గట్టిగా అరిచాను. నా అరుపులు విన్న మా అమ్మ వచ్చి భారతీరాజాను గుర్తుపట్టి లోపలికి పిలిచారు. అలా కలిసిన మేము మంచి స్నేహితులయ్యాం. ప్రతి రెండు రోజులకోసారి ఫొన్లో మాట్లాడుకుంటాం. ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది. ఇక ఓ సినిమాలో భరతనాట్యం చేయాల్సి వచ్చింది. అప్పడు నేను భయపడి వెళ్లిపోతా అని అంటే.. చాక్లెట్లు ఇచ్చి నన్ను ఒప్పించి డ్యాన్స్ చేయించారు. "
- రాధిక శరత్‌కుమార్, సీనియర్ నటి