బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ సినిమా షూటింగ్లో కొద్ది రోజుల క్రితమే గాయపడ్డారు. అయితే ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే మళ్లీ ఆ సినిమా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసం రెడీ అయ్యారు. ప్రస్తుతం అక్షయ్.. 'బడే మియా ఛోటే మియా' అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఓ యాక్షన్ సీన్‌ను బ్రిటన్(యూకే)లో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు. ఆ సీన్‌ను దాదాపు రూ.15 కోట్ల రూపాయలతో షూట్ చేస్తున్నారట. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను హెలికాప్టర్లు, బైక్‌లు, కార్లతో భారీగా రూపొందిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే గతవారం షూటింగ్లో యాక్షన్ స్టంట్స్ చేస్తూ మోకాలికి దెబ్బ తగిలి గాయపడ్డారు అక్షయ్. అయితే దురదృష్టవశాత్తు ఈ షూట్లో హీరోతో పాటు మరికొంత మంది ఆర్టిస్ట్‌లు కూడా గాయపడ్డారు. అప్పటినుంచి అక్షయ్ కుమార్ ఓ కర్ర సాయంతో నడుస్తున్నారని తెలిసింది. అయితే ఇప్పుడీ గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే మరో యాక్షన్ సీన్ చేసేందుకు సిద్ధమయ్యారు. భారీ బడ్జెట్‌తో ఈ సీక్వెన్స్ రూపొందుతుండటం వల్ల.. నష్టం రాకూడదు అనే ఉద్దేశంతో అక్షయ్ షూటింగ్లో పాల్గొనాలని నిర్ణయంచుకున్నారట. ఇక ఇది తెలుసుకున్న అభిమానులు.. సినిమా పట్ల అక్షయ్‌కు ఉన్న నిబద్ధతను చూసి అయన్ను కొనియాడుతున్నారు. అయితే షూటింగ్ సమయాల్లో నటుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు మేకర్స్.
గాయపడినా షూటింగ్ ఆపని స్టార్ హీరో.. రూ.15 కోట్లతో యాక్షన్ సీన్ - బ్రిటన్‌లో హీరో అక్షయ్ కుమార్ కాలికి గాయం
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఓ సినిమా షూటింగ్లో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తుండగా గాయపడ్డారు. అయినా కూడా షూటింగ్లో అలానే పాల్గొంటున్నారు. ఆ వివరాలు..
కాగా, గతనెల ప్రారంభమైన ఈ షూటింగ్ సీన్ వచ్చే నెల ఏప్రిల్ వరకు యూకేలోనే చిత్రీకరించనున్నారు. ఇక ఈ యాక్షన్ స్టంట్‌ను హాలీవుడ్ డైరెక్టర్ క్రెయిగ్ మెక్‌క్రే ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్లో నటిస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. టైగర్ సరసన హీరోయిన్గా జాన్వీ కపూర్ నటించనున్నారు. అయితే ఈ సినిమాలో టైగర్ పక్కన నటించే క్యారెక్టర్లో జాన్వీనే నటించాలని కోరుకున్నారట ష్రాఫ్. ఆయన కోరిక ప్రకారమే జన్వీని ఫైనల్ చేశారు మూవీమేకర్స్. కాకపోతే ఇందులో అక్షయ్‌కుమార్‌కు జోడీగా ఎవరూ లేరు. నటుడు, నిర్మాతగా ఉన్న జాకీ భగ్నానీ తన సొంత బ్యానర్ అయిన పూజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో కొంత షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీని స్కాట్లాండ్లోనూ చిత్రీకరించారు. ఇక ప్రస్తుతం బ్రిటన్ దేశంలో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ ఏడాదే ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్రబృందం. యాక్షన్ చిత్రాల్లో అదరగొట్టే అక్షయ్, టైగర్‌లలోని హీరోయిజాన్ని మరింత బాగా తెరపై చూపించే కథ ఇది.. అని అలీ అబ్బాస్ సన్నిహితులు చెప్పారు. అలానే ఈ సినిమాలో కామెడీ కూడా బాగా ఉంటుందట.