ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. తన తాజా ప్రాజెక్ట్ విడుదలకు సిద్ధంగా ఉన్న 'సెల్ఫీ' చిత్రం ప్రమోషన్లో భాగంగా బుధవారం ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే అక్కడికి వచ్చిన అభిమానులతో ఆయన కేవలం 3 నిమిషాల్లో ఏకంగా 184 సెల్ఫీలు దిగారు. తద్వారా ఈ ఫీట్‌తో గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించారు. దీనికి సంబంధించిన వీడియోను అక్షయ్ కుమార్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అయింది. దీంతో ఆయన్ను సెల్ఫీ కింగ్ అని నెటిజన్లు పిలుస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో అక్షయ్ ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకొని కనిపించారు. అలాగే గిన్నిస్ రికార్డు సర్టిఫికేట్‌ను కూడా ఆ వీడియోలో చూపించారు.
అంతకుముందు 2015లో లండన్‌లోని శాన్ ఆండ్రియాస్ ప్రీమియర్ షోలో హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ 3 నిమిషాల్లో 105 సెల్ఫీలు తీసి రికార్డు సృష్టించారు. అలాగే 2018లో కార్నివాల్ డ్రీమ్ అనే క్రూయిజ్ షిప్‌లో అమెరికాకు చెందిన జేమ్స్ స్మిత్ కేవలం 3 నిమిషాల్లో 168 సెల్ఫీలు తీసి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడీ రికార్డునే అక్షయ్ బ్రేక్ చేశారు.