తప్పులని విజయాలకు మెట్లుగా చేసుకుని, శ్రమనే విశ్వసించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు వారు ముద్దుగా పిలుచుకొనే ఏఎన్నార్. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి నట సామ్రాట్‌గా ఖ్యాతి గడించారు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన తర్వాత రెండు తరాల వారసులు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఇలా పలువురు ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్‌ను అందుకుని కెరీర్లో రాణిస్తున్నారు.
'విక్రమ్' సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోగా, 'మన్మథుడి'గా ఎక్స్పెరిమెంట్ చిత్రాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపైనూ రియాల్టీ షోతో ముందుకెళ్తున్నారు. ఇక నాగార్జున తర్వాత ఇండస్ట్రీలో ఆయన వారసులుగా నాగచైతన్య, అఖిల్ ప్రస్తుతం రాణిస్తున్నారు. అయితే ఈ ఇద్దరికీ మొదట్లో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత చైతూ క్రేజ్ దక్కించుకున్నా.. అఖిల్ మాత్రం ఇప్పుడిప్పుడే రాణిస్తున్నాడు.