టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న చిత్రం 'ఏజెంట్'. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్‌కు జంటగా సాక్షి వైద్య నటిస్తుండగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 28న తెలుగు, మలయాళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్లను వేగవంతం చేసి మూవీ యూనిట్ లేటెస్ట్గా ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది. ఆ వీడియోను మూవీ హీరో అఖిల్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.
'థింగ్స్ ఆర్ గెట్టింగ్ వైల్డ్' అనే క్యాప్షన్‌తో మొదలయ్యే ఆ వీడియోలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ నిలబడుకుని ఉండగా.. 'ధృవ' సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లే అవుతుంటుంది. ఇక వీడియో ఆఖరిలో "ఏజెంట్ ఎక్కడ ఉన్నావు" అని చరణ్ అంటారు. ఇక ఈ వీడియోకు 'స్టే ట్యూన్డ్ ధృవ x ఏజెంట్' అన్న క్యాప్షన్‌ను జోడించారు. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అసలు ఈ వీడియోకు అర్థం ఏంటా అంటూ పలువురు అభిమానులు నెట్టింట తెగ వెతికేస్తున్నారు.