Nagarjun The Ghost movie shooting: టాలీవుడ్ కింగ్ నాగార్జున- దర్శకుడు ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ది 'ఘోస్ట్'. సోనాల్ చౌహాన్ కథానాయిక. ఇటీవలే దుబాయ్‌లో యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న చిత్రబృందం.. తాజాగా కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. ఊటీలో దీన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా ఓ అద్భుతమైన ఫొటోను పోస్ట్ చేసి తెలిపారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. 'ఉదయం ఎప్పుడూ మ్యాజికల్గానే ఉంటుంది' అని వ్యాఖ్య రాసుకొచ్చారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాగ్ మాజీ రా అధికారిగా కనిపించనున్నారు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Nagashourya krishna vindra vihari song: యువహీరో నాగశౌర్య నటించిన రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. అనీష్ ఆర్.కృష్ణ దర్శకుడు. షిర్లే సెటియా కథా నాయిక. తాజాగా ఈ మూవీలోని 'వర్షంలో వెన్నెల' అనే రొమాంటిక్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది చిత్రబృందం. యువతను ఆకట్టుకునేలా ఉన్న ఈ గీతాన్ని.. ఆదిత్య ఆర్కే, సంజన కల్మంజి ఆలపించారు. సంప్రదాయబద్ధమైన కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు.. ఉద్యోగం కోసమంటూ హైదరాబాద్ వెళ్తాడు. ఆ తర్వాత ప్రేమలో పడిన అతని ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగిందనేది ఈ చిత్ర కథాంశం. ఇందులో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా ఓ కొత్త రకమైన పాత్రలో కనిపించనున్నారు. సీనియర్ నటి రాధిక బలమైన పాత్రలో కనిపిస్తారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్‌ప్రసాద్ మూల్పూరి సమర్పకులు.