Chorbazaar Senior Actress Archana: "కథానాయికల కెరీర్ చిన్నది. ఓ దశ దాటాక ఆవిడే నాయికగా నటించిన హీరోల సరసన అక్క, వదిన, అమ్మ పాత్రలు చేయాలి. వాళ్లకు సొంత ఆలోచనలు, కోరికలు, లక్ష్యాలు ఉండవా. ఈ కోణంలో సినిమాల్లో పాత్రలు సృష్టిస్తే బాగుంటుంది" అన్నారు సీనియర్ నటి అర్చన. 25ఏళ్ల విరామం తర్వాత 'చోర్ బజార్'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నారామె. ఆకాష్ పూరి హీరోగా నటించిన చిత్రమిది. జీవన్ రెడ్డి తెరకెక్కించారు. ఈనెల 24న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు అర్చన.
"నేను మొదటి నుంచీ మంచి కథా బలమున్న చిత్రాల్లోనే నటించా. అందుకే ఆ సినిమాలన్నీ నాకెంతో తృప్తినిచ్చాయి. అయితే ఓ దశ తర్వాత ఆడవాళ్లకు సరైన పాత్రలు లేకుండా పోయాయి. అలాంటప్పుడు నేనొచ్చి ఏం చేస్తాను. నా దర్శకులు.. గురువులు నన్ను ఓ స్థాయిలో నుంచోబెట్టారు. దానికోసం వాళ్లెంతో కష్టపడ్డారు. అలాంటప్పుడు ఆ స్థాయిని నేనెలా పాడుచేసుకుంటా. అందుకే మంచి కథ దొరికినప్పుడే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చా. తెలుగు తెర నుంచి గ్యాప్ తీసుకోవడానికి పెద్ద కారణాలైతే ఏమీ లేవు. ప్రతీ మూడు నెలలకీ ఒకటి రెండైనా తెలుగు కథలు వస్తుండేవి. నేనే వద్దనుకున్నా. అలా చాలా పెద్ద సినిమాలే వదులుకు".
"ఇదొక చక్కటి కలర్‌ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఇందులో నేను అమితాబ్ బచ్చన్ ఫ్యాన్‌గా కనిపిస్తా. ఆయన్ను ప్రేమిస్తా. ఆయన కోసం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతా. నిజంగా తమిళనాడులో ఎంజీఆర్ కోసం పెళ్లి చేసుకోని వారున్నారు. ఇది అలా వాస్తవానికి దగ్గరగా ఉన్న పాత్ర. అందుకే ఈ చిత్రం ఒప్పుకొన్నా. ఈ సినిమా కోసం నేను నా జానర్ దాటి బయటకొచ్చి నటించా. దీంట్లో రెండు నిమిషాలు టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తాను. కథతో పాటే సాగే పాత్ర నాది. కొంత సస్పెన్స్ ఉంటుంది".
"బెంగాలీ.. మరాఠీ భాషల్లో మహిళలకు ఎక్కువ వైవిధ్యమైన పాత్రలు దక్కుతున్నాయి. అక్కడ నా వయసున్న నాయికలు ఇంకా ప్రేమకథల్లో నటిస్తున్నారు. బోల్డ్ సీన్స్ చేస్తున్నారు. మంచి కథలు దొరికితే నాకూ అలాంటి పాత్రలు పోషించాలనుంది. అర్చన అంటే పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్ ఉంది. ఆ గుర్తింపును ఇప్పటికీ కొనసాగిస్తున్నా. నా వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా సాగుతోంది. ప్రస్తుతం తమిళం, కన్నడంలో ఓ ఆర్ట్ ఫిల్మ్ చేస్తున్నా. త్వరలో ఓ వెబ్‌సిరీస్ చేయనున్నా" అని అన్నారు.