Aishwarya Arjun Sarja Engagement : ప్రముఖ నటుడు, దర్శకుడు అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, హీరో ఉమాపతితో ఆమె జీవితాన్ని పంచుకోనున్నారు. శుక్రవారం వారి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుక చెన్నైలో జరిగినట్లు తెలుస్తోంది. కొద్దిమంది బంధువులు, పలువురు ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అటు అర్జున్ కుటుంబంగానీ ఇటు తంబి రామయ్య కుటుంబంగానీ ఎటువంటి ఫొటోలు విడుదల చేయలేదు.
అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాల్టీ షోలో.. హీరో ఉమాపతి పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇరువురి కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఉమాపతి, ఐశ్వర్య ఒకరినొకురు ప్రేమించుకున్నారు. ఉమాపతి పుట్టినరోజు(నవంబరు 8)న పెళ్లి తేదీని ప్రకటిస్తామని తంబి రామయ్య గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
కన్నడ, తమిళంలో కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది ఐశ్వర్య. ఓ తెలుగు సినిమా కూడా ఖరారు కాగా.. అది తాత్కాలికంగా నిలిచిపోయింది. అర్జున్ దర్శకత్వంలోనే తెరకెక్కాల్సిన సినిమా అది. మరోవైపు, అర్జున్ కీలక పాత్ర పోషించిన "లియో" థియేటర్లలో సందడి చేస్తోంది. విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమా ఇది.