ప్రస్తుతం వేసవి బాక్సాఫీస్ జోరు కాస్త నెమ్మదిగా నడుస్తోంది. సినిమాలేమి అంతగా ఆకట్టుకోలేదు. కేవలం 'బిచ్చగాడు 2', '2018' వంటి డబ్బింగ్ సినిమాలు మాత్రమే మంచి వసూళ్లను అందుకున్నాయి. అయితే వచ్చే వారం బాక్సాఫీస్ ముందు ఇద్దరు కుర్ర హీరోలు తమ సినిమాలతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న 'అహింస'తో పాటు, 'స్వాతిముత్యం' ఫేమ్ బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కిన 'నేను స్టూడెంట్ సర్' థియేటర్స్‌లో సందడి చేయనున్నాయి. వీరిద్దిరలో ఒకరు నటుడు దగ్గుబాటి రానా తమ్ముడు కాగా.. మరొకరు బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు. ఇలా ఇద్దరు హీరోల తమ్ముళ్లు ఒకే రోజు.. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో బాక్సాఫీస్ బరిలో దిగి పోటీ పడబోతున్నారు.
నిజానికి ఈ ఇద్దరు కుర్ర హీరోల సినిమాలు అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడి.. జూన్ 2న విడుదలకు సిద్ధమయ్యాయి. సరైన సమయం చూసుకుని ఈ రెండు చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వచ్చే శుక్రవారం జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా గవర్నమెంట్ హాలీడే ఉంటుంది. మరి ఈ సెలవు ఈ ఇద్దరు కుర్ర హీరోలకి కాస్త కలిసి వస్తుందో లేదో చూడాలి.
ఇకపోతే వాస్తవానికి మొదటి రోజు ఫస్ట్ షోకు ఎలాగో తక్కువ మందే వస్తారు! ఎందుకంటే.. కొత్త హీరోలు. ట్రైలర్స్ అంత స్పెషల్‌గా ఏమీ లేవు. రొటీన్ గానే ఉన్నాయి. కాబట్టి ఈ హీరోలు.. మొదటి ఆటకు ఆడియెన్స్‌ను రప్పించలేరు. కాబట్టి టాక్ మీదే రిజల్ట్ ఆధరపడి ఉంటుంది. ఫస్ట్ షో కాస్త హిట్ టాక్ తెచ్చుకున్నా.... సెలవు రోజైన నేపథ్యంలో మ్యాట్నీ నుంచి లైట్‌గా కలెక్షన్స్ పెరిగే ఛాన్స్‌లు ఉంటాయి. లేదంటే రెండో రోజు నుంచి అయినా పెరగొచ్చు.