'లైగర్' పరాజయం తర్వాత మొదటిసారి సైమా వేడుకలో హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్న సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. అయితే ఈ కార్యక్రమంలో యూత్ ఐకాన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ సినిమా అవార్డును గెలుచుకున్న విజయ్.. 'లైగర్' ఆడకపోవడంపై స్పందించారు.
''ఈ వేదికపై అవార్డు తీసుకున్న వారందరికీ నా అభినందనలు. గొప్ప సినిమాలతో ఈ ఏడాది చిత్రపరిశ్రమను మీరు ముందుకు తీసుకువెళ్లారు. నేను కూడా ప్రయత్నించా. కష్టపడి పనిచేశా. కానీ, అది సరిపోలేదు. మనందరికీ మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయి. ఎలాంటి రోజుల్లోనైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనం చేయాల్సిన పనులన్నింటినీ జాగ్రత్తగా పూర్తి చేయాలి. నిజం చెప్పాలంటే నేను ఈ కార్యక్రమానికి రాకూడదనుకున్నా. కానీ, మీ అందరికీ ఓ మాట ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చా. అభిమానులు, కుటుంబం, స్నేహితుల్ని అలరించేందుకు నేను మరింత కష్టపడి పనిచేస్తా'' అని విజయ్ దేవరకొండ వివరించారు. కాగా, దక్షిణాదిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'సైమా' అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబర్ 10, 11 తేదీల్లో బెంగళూరులో జరిగింది.