Adivi Sesh G2 Movie :విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం యంగ్ హీరో అడివి శేష్ స్టైల్. ఇప్పటి వరకు పలు జానర్స్‌లో నటించి అభిమానుల మనసులు దోచుకున్న ఈ స్టార్ ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ 'గూఢచారి 2' పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఓ అనూహ్య సంఘటన ఎదురైంది. తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తానంటూ ఓ ఫ్యాన్ నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో ఆ ట్వీట్‌ను చూసిన శేష్.. తన స్టైల్లో ఆ ఫ్యాన్‌కు రిప్లై ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?
2018లో విడుదలైన 'గూఢచారి' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సైలెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా శేష్‌కు బిగ్ హిట్ ఇచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రానికి ఫ్రాంచైజీగా 'జీ 2' అనే మూవీ తెరకెక్కుతోంది.
వినయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే 'జీ 2'కు సంబంధించిన అప్‌డేట్‌లు ఇవ్వమంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. అందులో భాగంగా ఓ నెటిజన్.. అడివి శేష్‌ను ట్యాగ్ చేస్తూ తాజాగా ట్వీట్ చేశారు. అప్‌డేట్ ఇవ్వక పోతే ఫిర్యాదు చేస్తానని అన్నారు.