Adipurush Theatrical Rights : 'రాధేశ్యామ్' అంచనాలను అందుకోలేకపోయినా, దేశవ్యాప్తంగా ప్రభాస్‌కు ఉన్న క్రేజీ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ 'ఆది పురుష్'. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ట్రేడ్ వర్క్ కూడా జరుగుతోంది. 'ఆది పురుష్' తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.100 కోట్లకు యూవీ క్రియేషన్స్ ఈ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై గతంలో ప్రభాస్ 'సాహో'లో నటించారు.
'ఆది పురుష్'లో కృతిసనన్ సీతగా కనిపించనుంది. లంకేశ్‌గా ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ వరుస చిత్రాలతో తీరిక లేకుండా ఉన్నారు. 'సలార్', 'ప్రాజెక్ట్' ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉండగా, మారుతీ దర్శకత్వంలో ఓ మూవీ, సందీప్ వంగాతో 'స్పిరిట్' చేయాల్సి ఉంది.