Adipurush Pre Release Business : అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా మరికొద్ది గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా లాభాల బాటలోకి రావాలంటే థియేటర్లలో కనీసం రూ.240 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టాలని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఆ ఎవరు చూస్తారులే అన్నవాళ్లే..
అయితే 'ఆదిపురుష్' టీజర్‌ను చూసినప్పుడు ప్రతిఒక్కరూ.. ఈ సినిమా తాము పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా లేదంటూ విమర్శలు గుప్పించారు. కానీ, కొద్దిరోజులకే ప్రభాస్‌పై ఉన్న నమ్మకం, అభిమానంతో పాటు శ్రీరాముడి మీద భక్తి కారణంగా ఈ భారీ ప్రాజెక్ట్‌పై పాజిటివ్ అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారు ప్రేక్షకులు. దీంతో ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌పై ఆడియన్స్‌లో అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి హైప్‌ను చూస్తుంటే బుకింగ్స్ విషయంలో అనూహ్యంగా దూసుకుపోయి భారీ బిజినెస్‌ను చేసేలా కనిపిస్తోంది. దీంతో డార్లింగ్ ప్రభాస్ తన ఖాతాలో 'ఆదిపురుష్'తో మరో భారీ విజయన్ని నమోదు చేయడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్.
ఇంతైతే హిట్.. అంతైతే బ్లాక్‌బస్టరే..
Adipurush Pre Release Collection : 'ఆదిపురుష్' సినిమా సౌత్ ఇండియా హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే కొనుగోలు చేసింది. ఈ సంస్థ ప్రాంతాల వారీగా సినిమా థియేట్రికల్ రైట్స్‌ను అమ్ముకుంది. అయితే ఈ మూవీ హిట్ అవ్వాలంటే అన్ని భాషల్లో కలుపుకుని రూ.240 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేయాల్సిందే. రూ.360 కోట్లకు పైగా షేర్ వసూళ్లను సాధిస్తే గనుక ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడం ఖాయం. మరోవైపు, ప్రాంతాల వారీగా కూడా కొనుగోలు చేసిన ధర కంటే ఎక్కువగా కలెక్షన్స్ వస్తేనే సినిమా ఎగ్జిబిటర్లు సేఫ్ జోన్లో ఉన్నట్లు. లేదంటే వీరింతా తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.
తెలంగాణలో ఇంత.. ఆంధ్రలో అంత!
Adipurush Pre-release : ఇప్పటికే 'ఆదిపురుష్' ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.240 కోట్ల ప్రీ- రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు అంచనా. ఈ మొత్తంలో ఎక్కువ శాతం తెలుగు రాష్ట్రాల నుంచే కావడం విశేషం. కాగా, నైజాం, ఆంధ్ర కలుపుకుని రూ.115.5 కోట్లకు 'ఆదిపురుష్' థియేట్రికల్ రైట్స్‌ను విక్రయించారట.
దీంట్లో ఒక్క నైజాం ఏరియా హక్కులనే రూ.50 కోట్లకు విక్రయించడం విశేషం. ప్రముఖ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ హక్కులను కొనుగోలు చేసింది. ఇక వైజాగ్ థియేట్రికల్ హక్కులను రూ.12.5 కోట్లకు, తూర్పుగోదావరి రూ.8 కోట్లకు, పశ్చిమ గోదావరి రూ.7 కోట్లకు, కృష్ణా రూ.7.5 కోట్లకు, గుంటూరు రూ.9 కోట్లకు, నెల్లూరు రూ.4 కోట్లకు విక్రయించారట. సీడెడ్ థియేట్రికల్ రైట్స్‌ను రూ.17.5 కోట్లకు అమ్మారట.
ఇకపోతే హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్‌ను రూ.72 కోట్లకు సేల్ చేశారట. దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల తర్వాత అత్యధికంగా కర్ణాటకలో రూ.12.5 కోట్లకు ఈ మూవీ హక్కులను అమ్మారట. దేశవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.4.5 కోట్లకు విక్రయించారట. ఓవర్సీస్ రైట్స్ రూ.30 కోట్లకు అమ్మారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం రూ.5.5 కోట్లను ఖర్చు చేశారట మేకర్స్. ఈ లెక్కన వరల్డ్ వైడ్‌గా 'ఆదిపురుష్' సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ విలువ అక్షరాల రూ.240 కోట్లు.
'హే రామా'.. ఒక్క టికెట్ 2వేలా!
Adipurush Movie : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా చూడటానికి అటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే అదనుగా అక్కడి థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల నిర్వాహకులు టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. ముఖ్యంగా ముంబయి, దిల్లీ మహానగరాల్లో ఒక్కో టికెట్‌ను రూ.1700, రూ.1800, రూ.2000లకు విక్రయిస్తున్నాయి. బెంగళూరు, కోలకతా సిటీల్లోనూ ఒక్కో టికెట్‌ను రూ.1000 కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లుగా అనేక మీడియా సంస్థల నివేదికలు చెబుతున్నాయి. దీంతో 'హే రామా'.. ఒక్క టికెట్ 2వేలా అంటూ కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.