Adipurush movie dialogues : 'ఆదిపురుష్' రిలీజ్ అయినప్పటి నుంచి ఆ చిత్రంలోని సంభాషణలపై సోషల్‌మీడియాలో తెగ ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది ఈ డైలాగ్స్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా హనుమాన్ సంభాషణలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చాలా మాస్‌గా ఉన్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమాలోని మొత్తం డైలాగ్స్‌తో పాటు హనుమాన్ సంభాషణలపై చిత్ర డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా స్పందించారు కూడా. ఎంతో శ్రద్ధ పెట్టి హనుమాన్ సంభాషణలు రాశానని చెప్పుకొచ్చారు. అయినా హనుమాన్ సంభాషణలపై విమర్శలు, ట్రోలింగ్ మాత్రం అస్సలు ఆగట్లేదు. అలాగే చిత్రంలోని సన్నివేశాలు, పాత్రల వేషధారణలు, సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ సెట్టింగ్స్, లొకేషన్స్.. అన్ని ఇతర చిత్రాల నుంచి కాపీ చేశారంటూ దర్శకుడు ఔం రౌత్‌ను నెటిజన్లు ఓ ఆటాడేసుకుంటున్నారు.
Adipurush Troll : చిత్రంలోని డైలాగ్స్, సన్నివేశాలను.. ఒరిజినల్ వాటికి జత చేస్తూ వాటిని సోషల్‌మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్రంలోని హనుమాన్ పాత్ర చెప్పిన డైలాగ్స్‌లో 'మారేగా బేటే', 'బువా కా బగీచా హై క్యా', 'జలేగి తేరా బాప్ కీ' బాగా ట్రోల్ అవుతున్నాయి. అవి హిందీ వెర్షన్లోనివి. అయితే గతంలో ఆధ్యాత్మిక గురువు హెచ్‌జీ హయగ్రీవ ప్రభు చెప్పిన ఓ డైలాగ్‌కు వీటిని జత చేసి పోస్ట్ చేస్తున్నారు. అందులో ఆ గురువు.. ఘీ కిస్కా? రావణ్ కా. కప్డా కిస్కా? రావణ్ కా. ఆగ్ కిస్కీ? రావణ్ కీ. జలీ కిస్కీ? రావణ్ కీ.(నెయ్యి ఎవరిది? రావణుడిది. వస్త్రం ఎవరిది? రావణుడిది. నిప్పు ఎవరిది? రావణ్ ది. చివరికి కాలింది ఎవరికి? రావణుడికి) అని చెబుతూ కనిపించారు. అయితే ఈ స్వామీజి చెప్పిన సంభాషణలనే.. 'ఆదిపురుష్'లో హనుమాన్ పాత్ర కోసం కాపీ చేశారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 'ఆదిపురుష్.. మొత్తం ఓ కాపీ అసైన్ మెంట్.', 'ఈ సంభాషణ.. గురువు వివరించే తీరు. ఇవి హనుమాన్ చెప్పినవి కావు. కానీ ఇప్పుడు హనుమాన్ నోటి నుంచి ఈ సంభాషణలు రావడానికి ఆ రైటరే కారణం. ఇలా చేయడం కరెక్ట్ కాదు', 'ఇలా కాపీ చేయడం వల్లే సినిమాకు ఇన్ని చిక్కులు' అని యూజర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Adipurush Dialogue writer : అంతకుముందు డైలాగ్స్ గురించి రైటర్ మాట్లాడుతూ.. "హనుమాన్ సంభాషణలను నేను తప్పుగా రాయలేదు. బాగా ఆలోచించాకే ఈ సంభాషణలను రాశాను. సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. అందరూ ఒకేలా మాట్లాడ లేరు కదా. అందుకే పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడానికి ఈ డైలాగ్స్‌ను ఇలా సరళీకరించాను" అని అన్నారు. వచ్చే వారంలోగా డైలాగ్స్‌లో మార్పులు చేస్తానని చెప్పారు.