పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'ఆదిపురుష్'. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో బాలీవుడ్ నటి కృతిసనన్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేసిన మూవీ టీమ్ శనివారం ఓ కొత్త పోస్టర్లతో పాటు ఓ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. సీతానవమి సందర్భంగా ఈ పోస్టర్‌ను రిలీజ్ చేసిన మూవీ టీమ్.. "అమరం, అఖిలం ఈ నామం, సీతారాముల ప్రియనామం" అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది.
ఓ పోస్టర్లో లంకలో ఉన్న సీతమ్మ.. రాముడి రాక కోసం కన్నీళ్లతో ఎదురుచూస్తున్నట్లు కనిపించారు. మరో పోస్టర్లో సీతమ్మ తల్లి వెనుక రామునిగా ప్రభాస్ నిల్చుని ఉన్నారు. ఇక ఇదే పోస్టర్లో లక్ష్మణుడితో కలిసి శ్రీరాముడు లంకకు పయనమైనట్లు కనిపించారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అంతక ముందు రిలీజైన ఫస్ట్ సింగిల్‌తో పాటు ప్రభాస్ మోషన్ పోస్టర్‌కు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
టీ-సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించగా.. హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. ఇక లంకేశుని పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లను ప్రారంభించిన మూవీ టీమ్.. కొత్త పోస్టర్లు, లిరికల్ సాంగ్స్‌ను ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.
అయితే ఈ సినిమాకు ఆది నుంచి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. త్వరగానే రిలీజవ్వాల్సిన సినిమా వీఎఫ్‌ఎక్స్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది రిలీజైన టీజర్‌కు అభిమానుల్లో మిశ్రమ స్పందన రావడం వల్ల మూవీ టీమ్ గ్రాఫిక్స్‌ను మెరుగుపరిచింది. ఈ క్రమంలో ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్లు చాలా బాగున్నాయని అభిమానులు అంటున్నారు.
కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మే 3న లేకుంటే మే 17న సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోందని టాక్. అంతే కాకుండా ఈ ట్రైలర్ నిడివి 3 నిమిషాల 22 సెకండ్లుగా ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మూవీ టీమ్ ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వలేదు.