Adipurush Dialogues : 'ఆదిపురుష్' సినిమాలోని కొన్ని డైలాగ్స్ ప్రేక్షకుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ.. సోషల్‌మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా ఆ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇటీవలే ఈ విషయంపై వివరణ ఇచ్చినా.. ఆయనపై విమర్శలు ఆగకపోవడంతో తాజాగా మరో ట్వీట్ పెట్టారు. కొన్ని సంభాషణలు మారుస్తున్నట్లు ప్రకటించారు.
"ప్రతి ఒక్కరి భావోద్వేగాలను గౌరవించడం రామకథ నుంచి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం అని నా అభిప్రాయం. 'ఆదిపురుష్' కోసం నేను 4000 లైన్లకు పైగా డైలాగులు రాశాను. వాటిల్లో 5 లైన్లు కొందరిని బాగా బాధించాయని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీరాముడిని, సీతమ్మను కీర్తిస్తూ చాలా సంభాషణలు ఉన్నాయి. కానీ వాటి కంటే ఈ 5 లైన్లే ఎక్కువ ప్రభావం చూపాయనిపిస్తోంది. నా సోదరులు ఎంతో మంది నన్ను ఘోరంగా విమర్శిస్తున్నారు. మూడు గంటల సినిమాలో 3 నిమిషాలు మీ ఊహకు భిన్నంగా రాశానని నాపై సనాతన ద్రోహి అని ముద్ర వేశారు"
-- మనోజ్ ముంతాషిర్ శుక్లా, డైలాగ్ రైటర్
"'ఆదిపురుష్'లో ఉన్న 'జై శ్రీరాం', 'శివోహం', 'రామ్ సీతారామ్' లాంటి గొప్ప పాటలు నా కలం నుంచి పుట్టినవే. మీరు ఈవేమీ చూడకుండా నాపై నింద వేయడంలో తొందరపడ్డారు అనుకుంటున్నాను. నన్ను నిందించిన వారిపై నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఇలా ఒకరిపై ఒకరం ఫిర్యాదు చేసుకుంటే సనాతన ధర్మానికి నష్టం కలుగుతుంది. మేము సనాతన సేవ కోసం ఈ సినిమా తీశాం. మీరందరూ ఆదిపురుష్‌ను ఎంతో ఆదరిస్తున్నారు. భవిష్యత్తులోనూ మీ ప్రేమాభిమానాలు ఇలానే ఉంటాయని ఆశిస్తున్నాను. మాకు ప్రేక్షకుల మనోభావాలు చాలా ముఖ్యం. అందుకే మూవీ యూనిట్ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మీకు బాధ కలిగించిన డైలాగులను మారుస్తున్నాం. ఒక వారంలో ఈ మార్పును చేయనున్నాం. మీ అందరి సూచనలను గౌరవిస్తున్నాం" అని ఆయన ట్వీట్ చేశారు.
ఇక ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఓపెనింగ్స్‌లో అదరగొట్టిన ఈ సినిమా.. రెండు రోజు కూడా కలెక్షన్ల పరంగా జోరు కొనసాగిస్తోంది. సోషల్ మీడియాలో నెగిటివిటీ ఉన్నప్పటికీ.. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ సంచలనాలు సృష్టిస్తోంది. ఓపెనింగ్స్‌లో దాదాపు 140 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ.. ఇప్పుడు రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరుకుంది. రెండు రోజులకు గాను రూ.240 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం తెలిపింది.