Adipurush Runtime : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం.. 'ఆదిపురుష్' మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యు (U) సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు.
టాలీవుడ్‌లో చాలా తక్కువ చిత్రాలు ఇంతటి రన్‌టైమ్ (సుమారు 3 గం.)తో తెరకెక్కాయి. ప్రభాస్- రాజమౌళి కాంబోలో తెరకెక్కిన బాహుబాలి కన్నా ఈ సినిమా రన్‌టైమ్ ఎక్కువే. బాహుబలి రన్ టైమ్ 2 గంటల 38 నిమిషాలు కాగా.. బాహుబలి 2 రన్ టైమ్ 2 గంటల 47 నిమిషాలు. అయితే కంటెంట్ బాగుంటే సినిమా ఎన్ని గంటలున్నా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం తెలిసిందే. ఈ విషయం నాటి దానవీర శూర కర్ణ నుంచి గతేడాది వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ వరకు నిరూపితమైంది.
రామాయణం ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్.. రాముడిగా, హీరోయిన్ కృతిసనన్.. సీతగా కనిపించనున్నారు. రావణుడి పాత్రలో లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్, హనుమంతుడిగా సన్నీసింగ్ నటించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జూన్ 16న విడుదలకానుంది.
Adipurush Pre Release Event : ఈ సందర్భంగా ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో భారీ స్థాయిలో నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో చిత్రయూనిట్.. సినిమా ఫైనల్ ట్రైలర్ విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ ఫైనల్ ట్రైలర్ విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు ప్రభాస్ లుక్, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 24 గంటల్లో ఈ సినిమా తెలుగు ట్రైలర్‌కు 6.19 మిలియన్ల వ్యూస్ లభించాయి.
ఇటువంటి దర్శకుడిని 20 ఏళ్లలో చూడలేదు!
తన 20 ఏళ్ల కెరీర్లో ఓం రౌత్ లాంటి దర్శకుడు ఎవరినీ చూడలేదని ప్రభాస్ వ్యాఖ్యానించడం విశేషం. గత ఏడెనిమిది నెలలుగా ప్రతిరోజూ నిద్ర లేకుండా పని చేశారని ఆయన చెప్పారు. రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే నిద్ర పోయారని, కుటుంబాలకు టైమ్ లేకుండా ఒక్కొక్కరూ పది రేట్లు పని చేశారని ఆయన చెప్పారు. గడిచిన ఎనిమిది నెలలు ఓం రౌత్ అండ్ టీమ్ ఒక యుద్ధం చేశారని, ఒక్కసారి వాళ్ల ముఖాలు చూడమని ప్రభాస్ వ్యాఖ్యానించారు.