విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న కథానాయకుడు అడివిశేష్. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెర కెక్కిన 'మేజర్' చిత్రం చేశారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలవుతున్న ఆ సినిమా ప్రచారంలో భాగంగా దేశమంతా పర్యటిస్తున్నారు అడివి శేష్. ఈ సందర్భంగా ఆయన 'ఈనాడు సినిమా'తో ఫోన్‌లో సంభాషించారు.
విడుదలకి ముందే పలుచోట్ల సినిమాని చూపిస్తున్నారు. ఆ నిర్ణయం వెనుక కారణమేంటి?
అమాయకమైన కారణాలతో తీసుకున్న నిర్ణయం అది. తెలుగులో ప్రచారం చేసినట్టుగా, హిందీలోనూ టెలివిజన్ కార్యక్రమాల్లో పాల్గొందామని మేం భావించాం. అక్కడ కొన్ని షోలు రద్దయ్యాయి. మా సినిమా విడుదల సమయానికి ఇలాంటి అడ్డంకులు వచ్చాయేమిటి అనిపించింది. మా సినిమా ఎంత బాగుందో మేం షోలల్లో పాల్గొని చెప్పేబదులు, సినిమానే చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. మేజర్ సందీప్ సాహసం స్ఫూర్తితో మేం ధైర్యంగా వేసిన అడుగు అది. భారతీయ సినిమా చరిత్రలో ఓ పెద్ద సినిమాని పది రోజుల ముందే పది నగరాల్లో ప్రదర్శించడం చాలా పెద్ద విషయం. ప్రేక్షకుల నుంచి నా కెరీర్‌లోనే అత్యుత్తమమైన స్పందనని చూశా.
మేజర్ సందీప్ తల్లి దండ్రులు సినిమాని చూశారా?
వాళ్లు ఇప్పటికే చాలా సన్నివేశాల్ని చూశారు. 31వ తేదీన పూర్తిస్థాయి సినిమాని బెంగళూరులో చూస్తారు. నిర్మాణంలో భాగమైన కథానాయకుడు మహేష్‌బాబు చూశారు. అందమైన వ్యక్తి నుంచి అంతే అందమైన స్పందన వచ్చింది. ఆయన మెచ్చుకోవడం మాకు ఆస్కార్ గెలవడంతో సమానం.
26/11 నేపథ్యాన్ని ఇదివరకు చాలా మంది స్పృశించారు కదా...?
'తొలిప్రేమ' వచ్చిందని 'ఖుషీ' చూడకుండా ఉండలేం కదా. మేం చెప్పాలనుకున్నది ఒక అందమైన జీవితం గురించి. అందులో కార్గిల్ యుద్ధం ఉంటుంది, 26 /11 నేపథ్యమూ ఉంటుంది. సందీప్ హైదరాబాద్ కంటోన్మెంట్‌లో కెప్టెన్. హర్యానాలో ట్రైనింగ్ ఆఫీసర్. సందీప్ తన ఆఖరి 36 గంటల్లో ఎన్ని వందలమంది ప్రాణాలు కాపాడి చనిపోయారో అందరికీ తెలుసు కానీ... దానికి ముందు 31 ఏళ్లు ఎంత అందంగా బతికారనేది ఎవరికీ తెలియదు. సినిమాలో మొదటి 35 నిమిషాలు 'జానే తు యా జానే నా', 'నువ్వే కావాలి' లాంటి సినిమాలు చూసినంత ఆహ్లాదంగా ఉంటుంది.
సందీప్ జీవితంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారా?
సందీప్ జీవిత సారాన్ని తీసుకుని చేసిన కథ ఇది. కొన్ని కల్పితాలు ఉండొచ్చు కానీ.. ఆ జీవితానికీ, అందులోని భావోద్వేగాలకి న్యాయం చేస్తున్నామా లేదా? అనేది చూసుకునే సినిమా చేశాం. పక్కింటి కుర్రాడు. అమ్మానాన్నతో కలిసి పాయసం తింటూ దాని గురించి మాట్లాడిన కుర్రాడు. స్కూల్‌కి వెళుతూ, సరదాగా ఆడుకుంటూ, గళ్‌ఫ్రెండ్‌తో ముచ్చట్లు చెబుతూ, స్నేహితులతో కలిసి స్కూల్‌కి బంక్ కొట్టి సినిమాలు, షికార్లు అంటూ తిరిగిన ఆ కుర్రాడు మేజర్ సందీప్ ఎలా అయ్యాడు? కార్గిల్ యుద్ధంలోనూ, తాజ్ లోపల తను తీసుకున్న పెద్ద పెద్ద నిర్ణయాలకి అప్పటిదాకా గడిపిన అతని జీవితం ఎలా ప్రభావితం చేసిందనే విషయాల్ని ఇందులో చూపించాం.
ఈ చిత్రీకరణలో ఎదురైన సవాళ్లేంటి?