Actress Who Acted In 450 Films : విజయలక్ష్మి.. ఈ పేరు ఎక్కడా విన్నట్లు లేదా? విజయలక్ష్మి అంటే తెలియకపోవచ్చు కానీ.. సిల్క్ స్మిత అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. దశాబ్దన్నర పాటు దక్షిణాది చిత్రపరిశ్రమను ఒక ఊపు ఊపిన తార ఆమె. ఒక తెలుగు సినిమాలో చెప్పినట్లు.. సిల్క్ స్మిత పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. అలాంటి సిల్క్ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు.. ఎన్నో కష్టమైన రోజులు. అయినప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగిన తీరును ఎవ్వరూ మరిచిపోలేరు. ఆమె మనతో ఉన్నది కొంత కాలమే అయినా తన సినిమాలతో ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తుంటారు.
1960, డిసెంబర్ 2న జన్మించిన సిల్క్.. తెలుగుతో పాటు తమిళంలో వందలాది విజయవంతమైన చిత్రాల్లో నటించారు. కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ పలు సినిమాల్లో ఆమె కనిపించారు. సహాయ నటిగా కెరీర్‌ను మొదలుపెట్టిన సిల్క్.. 1979లో విడుదలైన తమిళ చిత్రం 'వందిచక్కరం'తో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో అన్ని భాషల్లో కలిపి ఏకంగా 450 సినిమాలు చేశారు. చివరికి 1996, సెప్టెంబర్ 23న విషాదకర రీతిలో కన్నుమూశారు.
ఇంటి నుంచి పారిపోయి..
Silk Smitha Biography : కుటంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల చిన్నతనంలోనే సిల్క్ స్మిత చదువు మానేయాల్సి వచ్చింది. ఆమెకు 14వ ఏటే వివాహం జరిగిందని అంటుంటారు. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియదు. అయితే పెళ్లి తర్వాత గృహహింసను కూడా ఎదుర్కొన్నారట సిల్క్. భర్తతో పాటు అత్తారింటి వేధింపులు తాళలేక ఆమె ఇంటి నుంచి పారిపోవాల్సి వచ్చిందని చెబుతుంటారు. భర్త ఇంటి నుంచి బయటికొచ్చిన సిల్క్.. మేకప్ ఆర్టిస్ట్ అయిన తన స్నేహితురాలి దగ్గరకు చేరారు.
సిల్క్ తన స్నేహితురాలి వెనక సినిమా చిత్రీకరణలకు వెళ్తూ అక్కడ మేకప్‌లో మెళకువలు నేర్చుకున్నారు. కొన్ని నెలల తర్వాత ఆమె మేకప్ ఆర్టిస్టుగా పని చేయడం ప్రారంభించారు. అయితే ఆంథోని ఈస్ట్ మన్ అనే దర్శకుడు ఇచ్చిన ఆఫర్ సిల్క్ జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత తమిళ దర్శకుడు వినూ చక్రవర్తితో కలసి పని చేయడం వల్ల ఆమె సినీ కెరీర్ ఒకేసారి భారీ మలుపు తిరిగింది.