"నేనెప్పుడూ కథలో నా పాత్ర బాగుందా లేదా? నా మనసుకు నచ్చిందా? లేదా? అని ఆలోచించే ఓ సినిమాకు ఓకే చెప్తా. అంతేకానీ, ఆ పాత్ర చేస్తే ప్రేక్షకులు ఏం అనుకుంటారు? దాన్ని ఎలా స్వీకరిస్తారు? అన్నది దృష్టిలో పెట్టుకోను. నా మనసుకు ఏది సరైనదనిపిస్తే అది చేస్తా" అంది కథానాయిక శ్రుతిహాసన్. ప్రస్తుతం అగ్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తూ జోరు చూపిస్తున్న ఈ నాయిక.. సంక్రాంతికి 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది శ్రుతిహాసన్.
ఈసారి మీ సంక్రాంతి సంబరాలు ఎలా ఉండనున్నాయి?
"నేను తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన తర్వాతే సంక్రాంతి పండుగ అనేది నా జీవితంలోకి వచ్చింది. తమిళనాడులో ఈ పదం వినిపించదు. అక్కడ పొంగల్ అంటాం. అందరిలాగే నేనూ ఈ పండుగను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోనున్నా. పూజ చేసుకొని.. పొంగల్ తింటూ హ్యాపీగా ఫ్యామిలీతో గడపాలనుకుంటున్నా. ఇంతకంటే హడావుడి ఏం చేయట్లేదు".
ఈ పండక్కి రెండు చిత్రాలతో వస్తున్నారు. మీతో మీరే పోటీ పడుతున్నారు. ఏమన్నా ఒత్తిడిగా ఉందా?
"వాల్తేరు వీరయ్య, 'వీరసింహారెడ్డి' చిత్రాలు రెండూ ఒకేసారి వస్తాయని అసలు ఊహించలేదు. నా కెరీర్‌లో ఇలా జరగడం ఇది రెండో సారి. గతంలోనూ ఓ పండక్కి ఇలాగే నా రెండు సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. అయితే ఈ సంక్రాంతి మాత్రం చాలా ప్రత్యేకం. చిరంజీవి, బాలకృష్ణ లాంటి ఇద్దరు లెజెండ్ హీరోలతో కలిసి ఒకేసారి రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడు ఒత్తిడి ఏం లేదు. కాకపోతే రెండు చిత్రాలు సెట్స్‌పై ఉన్నప్పుడు ఒత్తిడిగానే అనిపించేది. నా ఎక్స్‌ప్రెషన్స్ ఎలా వచ్చాయి? సంభాషణలు సరిగ్గా చెప్పానా? హవభావాలు సరిగ్గా పలికాయా లేదా? అని ఆలోచిస్తుండేదాన్ని. నా పని పూర్తయ్యాక మాత్రం ఎలాంటి ఒత్తిడీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫలితం ప్రేక్షకుల చేతుల్లో ఉంది".
ఈ రెండు చిత్రాల్లో మీ పాత్రలు ఎలా ఉండనున్నాయి?
"వీరసింహారెడ్డిలో నా పాత్ర వినోదాత్మకంగా ఉంటుంది. 'బలుపు' చిత్రంలోని నా శ్రుతి పాత్రలో కనిపించే ఎనర్జీ ఇందులోనూ కనిపిస్తుంది. ప్రేక్షకుల్ని చాలా నవ్విస్తుంది. 'వాల్తేరు వీరయ్య'లో నా పాత్ర ఫన్నీగా ఉంటుంది. అదే సమయంలో కాస్త యాక్షన్ టచ్ కూడా ఉంటుంది. సినిమాలో నాకు చిరంజీవికి మధ్య చిన్న ఫన్నీ ఫైట్ ఉంటుంది. దాన్ని రామ్-లక్ష్మణ్ కొరియోగ్రాఫ్ చేశారు. ఈ రెండు చిత్రాలు వేటికవే పూర్తి భిన్నంగా ఉంటాయి. కథ కథనాలు చాలా కొత్తగా.. ఆకట్టుకునేలా ఉంటాయి".
చిరంజీవి, బాలకృష్ణ చాలా మంచి డ్యాన్సర్లు. వాళ్లతో కలిసి కాలు కదపడం ఏమన్నా సవాల్‌గా అనిపించిందా?
"చిరు, బాలయ్యలతో కలిసి డ్యాన్స్ చేయడం చాలా బాగుంది. ఈ రెండు సినిమాలకీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. "సుగుణ సుందరి" పాటలోని స్టెప్స్ చాలా మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. అలాగే "శ్రీదేవి - చిరంజీవి" పాటలోనూ భిన్నమైన గ్రేస్ ఉన్న స్టెప్స్ చేశాం. ఆ పాటకీ చక్కటి ఆదరణ లభిస్తోంది. దీన్ని మేము యూరోప్‌లో మైనస్ 11డిగ్రీల చలిలో షూట్ చేశాం. ఆ చలిని తట్టుకోవాలంటే ఓ కోట్ సరిపోదు. నాలుగైదు కోట్స్ ధరించాలి. అంత గడ్డకట్టించే చలిలో ఓ పలుచటి చీర కట్టుకొని స్టెప్పేయడం చాలా సవాల్‌గా అనిపించింది".