'ఆలీతో సరదాగా' లో పాల్గొని నాటి సంగతులను నటి సంగీత గుర్తుచేసుకున్నారు. ఇటీవల, తాను కీలక పాత్ర పోషించిన 'మసూద' చిత్ర విశేషాలు పంచుకునేందుకు నాయకానాయికలు తిరువీర్, కావ్యలతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో హీరోయిన్ తల్లిగా నటించటం తన కెరీర్‌కు ప్లస్ అయిందని, మరోవైపు మైనస్ అయిందని సంగీత వివరించారు. ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిని చూస్తే తిట్టుకుంటానే ఉంటానన్నారు. అనంతరం, తాను గతంలో అవకాశం కోల్పోయిన ఓ సినిమా గురించి వివరించారు. తానొక సినిమా చిత్రీకరణలో రెండు రోజులు పాల్గొన్నానని.. ఆ తర్వాత తనను ఆ మూవీ నుంచి తొలగించారని తెలిపారు.
"బాల నటిగా 12 సినిమాల్లో నటించా. మసూద.. హీరోయిన్‌గా నేను నటించిన తొలి చిత్రం. మసూద అనేది ఉర్దూ పదం. ఇలాంటి హారర్ డ్రామా సినిమా మన తెలుగులో ఇటీవల రాలేదనుకుంటున్నా" అని కావ్య తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తన పక్కన హీరోయిన్‌గా నటించాలని అల్లు అర్జున్ ఓ సందర్భంలో అడిగారని, అప్పటికి తాను చిన్న పిల్లకావడంతో 'నేను హీరోయిన్ అయ్యే టైమ్‌కి మీరు ముసలివాళ్లు అయిపోతారు' అని సమాధానమిచ్చానని కావ్య నవ్వుతూ తెలిపారు. 'బాలు', 'గంగోత్రి', 'విజయేంద్ర వర్మ', 'అడవి రాముడు' తదితర సినిమాల్లో బాల నటిగా మెప్పించింది కావ్య.