స్త్రీ ద్వేషంతోనే పలువురు హీరోయిన్ దీపికా పదుకొణెను ట్రోల్ చేస్తున్నారని కన్నడ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు రమ్య అన్నారు. స్త్రీ వ్యతిరేకతపై ఎదురు తిరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. 'బేషరమ్ రంగ్' పాట వివాదంపై స్పందించిన ఆమె.. సమంత, రష్మిక పేర్లను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆయా నటీమణులు ఏ విషయంలో ట్రోల్స్ ఎదుర్కొన్నారో చెప్పారు.
"విడాకులు తీసుకుందనే కారణంతో సమంతను అప్పట్లో ట్రోల్ చేశారు. అలాగే, తన అభిప్రాయాన్ని బయటపెట్టినందుకు సాయిపల్లవి, ఓ నటుడి నుంచి విడిపోయినందుకు రష్మిక, కురచ దుస్తులు వేసుకుందని దీపిక.. ఇలా చెబుతూ వెళితే ఎంతో మంది మహిళలు ఇలాంటి చిన్న చిన్న కారణాలకు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇష్టమైన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉంది. దుర్గాదేవి ప్రతిరూపాలే మహిళలు. స్త్రీ ద్వేషం అనే రాక్షసుడిపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది" అని రమ్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు.