తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నన్ను అవమానించారని తెలిస్తే చిరంజీవి ఊరుకోరు' - చిరంజీవిపై పావలా శ్యామలా ప్రశంసలు

ప్రముఖ నటి పావలా శ్యామల తనకు జరిగిన అవమానం గురించి మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవికి ఈ విషయం తెలిస్తే ఊరుకోరని అన్నారు.

Actress Pavala Shyamala praises on megastar chiranjeevi
actress pavala shyamala comments on chiru

By

Published : Dec 14, 2022, 2:54 PM IST

ప్రముఖ నటి పావలా శ్యామల.. మరోసారి తనకు మెగాస్టార్ చిరంజీవి చేసిన సహాయాన్ని గుర్తుచేసుకున్నారు. గుండె సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతోన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. చిరుపై ప్రశంసలు కురిపించారు. ఆయన తోటి నటీనటులను గౌరవంగా చూసుకుంటారని, అందర్నీ అభిమానిస్తుంటారని చెప్పారు. అవకాశం వస్తే ఓసారి మెగాస్టార్​ను కలిసి తనకు జరిగిన అవమానం గురించి చెప్పాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

"చిరంజీవి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అగ్రస్థానంలో ఉన్నప్పటికీ పని పట్ల ఆయన అంకితభావం చూపిస్తుంటారు. కరోనా సమయంలో ఎంతోమందికి సాయం అందించారు. నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని తెలుసుకుని రూ.2 లక్షలు పంపించి ఆదుకున్నారు. నటీనటులకు ఎలాంటి అన్యాయం జరిగినా ఆయన ముందుండి మాట్లాడతారు. ఆయనను ఒకసారి కలవాలని ఉంది. నాకు జరిగిన అవమానం గురించి ఆయనతో చెప్పాలని ఉంది. నాకు జరిగిన అవమానం గురించి ఆయనకు తెలిస్తే సహించరు" అని ఆమె తెలిపారు. అయితే తనకు జరిగిన అవమానం ఏమిటనేది ఆమె వెల్లడించలేదు.

టాలీవుడ్‌లోని పలువురు స్టార్‌హీరోలు తనకు ఆర్థిక సాయం చేశారని ఇటీవల సోషల్‌మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయని వాటిల్లో ఎలాంటి నిజం లేదని ఆమె అన్నారు. గబ్బర్‌సింగ్‌ సమయంలో పవన్‌కల్యాణ్‌ తనకు రూ.లక్ష సాయం చేశారని తెలిపారు. మందులు కొనుగోలు చేయడానికి డబ్బుల్లేక.. సినిమాలో చిన్న పాత్ర ఉంటే ఇప్పించమని అడగడానికి పవన్‌కల్యాణ్‌ వద్దకు వెళ్తే తన ఇబ్బందులు తెలుసుకుని రూ.లక్ష ఇచ్చారని అన్నారు. రంగస్థలం నటిగా కొన్ని వందల నాటకాల్లో నటించి.. అవార్డులు, ప్రశంసలు అందుకున్న ఆమె.. నటనపై ఉన్న మక్కువతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో పలు చిత్రాల్లో హాస్యనటి, సహాయనటిగా కనిపించారు. గోలీమార్‌, మనసంతా నువ్వే, ఖడ్గం, ఆంధ్రావాలా వంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. మత్తువదలరా తర్వాత ఆమె సినిమాల్లో కనిపించలేదు. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ఆమె తన కుమార్తెతో కలిసి హైదరాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు.

ఇదీ చూడండి:ట్రాన్స్​జెండర్​గా మారిన ఈ స్టార్ యాక్టర్​ను గుర్తుపట్టారా?

ABOUT THE AUTHOR

...view details