నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ నటించిన దసరా మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. అయితే ఈ సినిమాలో కీర్తి సురేశ్ వెన్నెల పాత్ర.. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో కీర్తి జీవించేసింది. ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది. తాజాగా ఈ సినిమాలో ఆమె వేసిన తీన్మార్ స్టెప్పుల వీడియో వైరల్ అవుతోంది.
సినిమాలో తన పెళ్లి సమయంలో రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తుంది వెన్నెల. మూవీలో ఆమె డ్యాన్స్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఆ వీడియోను మేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు. ఇందులో కీర్తి సురేశ్ రెచ్చిపోయి డ్యాన్స్ చేయడం చూడొచ్చు. మాస్ స్టెప్పులతో ఆమె అలరించింది. బ్యాండ్ బీట్‌కు తగినట్లు డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టింది.
శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వచ్చిన దసరా సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.87 కోట్లకు పైగా వసూలు చేసింది. నాని కెరీర్లో తొలి రూ.100 కోట్ల సినిమాగా నిలువనుంది. ఫస్ట్ వీకెండ్లో కలెక్షన్ల వర్షం కురిపించిన దసరా మూవీకి ఈ వారం మాత్రం రావణాసుర నుంచి పోటీ ఎదురుకానుంది.
ఇక ఈ సినిమా తాము ఊహించిన దాని కంటే కూడా పెద్ద సక్సెస్ సాధించిందని నేచురల్ స్టార్ నాని అన్నారు. ఉత్తరాదిలో ఆశించిన మేర కలెక్షన్లు రాకపోయినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అదరగొడుతోంది. ఇందులో ఊర మాస్ క్యారెక్టర్లో కనిపించిన నాని.. ఇక ఇప్పట్లో ఇలాంటి మాస్ సినిమా మరొకటి చేయబోనని స్పష్టం చేశారు.
తాజాగా ఈ సినిమాపై దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ఈ మూవీలో నాని తన కెరీర్లోనే అత్యుత్తమమైన నటనను ప్రదర్శించాడని కొనియాడారు. హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా వెన్నెల క్యారెక్టర్లో ఒదిగిపోయి అవలీలగా నటించందంటూ మెచ్చుకున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. వాస్తవ ప్రపంచంలో పాత్రల మధ్య హృదయానికి హత్తుకునే ఓ గొప్ప లవ్ స్టోరీని తెరకెక్కించారని ప్రశంసించారు.
ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించారు రాజమౌళి. అద్భుతమైన విజయాన్ని అందుకున్న దసరా చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అంతకుమందు టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం 'దసరా'. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్గా అలరించింది. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న మొత్తం 5 భాషల్లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా దాదాపు 3 వేలకుపైగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. రిలీజైన మొదటి రోజు నుంచే తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.