తెలంగాణ

telangana

By

Published : Nov 27, 2022, 6:48 AM IST

Updated : Nov 27, 2022, 6:54 AM IST

ETV Bharat / entertainment

'హైదరాబాద్​ అంటే చాలా ఇష్టం.. తెలుగు సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తున్నా'

అందాల తార శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్​ 'ధడక్'​ సినిమాతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో మెరిసిన ఈ తార.. తాజాగా మన భాగ్యనగరంలో జరిగిన ఓ ఫ్యాషన్​ షోలో సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను పంచుకుంది. అవి ఆమె మాటల్లోనే..

actress janhvi kapoor special interview
actress janhvi kapoor special interview

Janhvi Kapoor Interview: శ్రీదేవి తనయగానే కాకుండా.. కథానాయికగా తనదైన ముద్ర వేసే ప్రయత్నంలో ఉంది జాన్వీకపూర్‌. వరుసగా సినిమాలు చేస్తూ కథల ఎంపికలో ఈమె అభిరుచి ప్రత్యేకం అని నిరూపిస్తోంది. ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్న జాన్వీ... ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో ముచ్చటించింది.

మీ దృష్టిలో ఫ్యాషన్‌ అంటే?
సౌకర్యవంతమే. మనం ఏది ధరిస్తే సౌకర్యంగా ఉంటుందో అదే మనకు అందాన్ని తీసుకొస్తుందని నమ్ముతాను. పర్యావరణ హితమైన సస్టైనబుల్‌ ఫ్యాషన్‌ని ఇష్టపడతాను. ఆ క్షణంలో నాకు ఏది ధరించాలనిపిస్తే అది ధరిస్తాను తప్ప, ప్రత్యేకంగా ప్రణాళికలంటూ ఏమీ ఉండవు.

ఫ్యాషన్‌, స్టైలింగ్‌ లాంటి విషయాల్లో మీకు స్ఫూర్తి ఎవరు?
నా చెల్లెలు ఖుషి. స్టైల్‌ విషయంలో తన అభిరుచి నాకు నచ్చుతుంది. నా స్టైల్‌కి సంబంధించి తను అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంది. నేను ఏది ధరించినా అది బాగుందో లేదో తనే చెబుతుంటుంది. నేను దూరంగా ఉన్నా తనకి ఫొటో తీసి పంపుతుంటా. మా అమ్మకి కూడా డ్రెస్‌ అప్‌ అవ్వడంపై చాలా శ్రద్ధ తీసుకునేవారు. తన సినిమాల చిత్రీకరణలకి వెళుతూ పరిశీలించేవాళ్లం. దుస్తులు ధరించడం గురించి మాతో అమ్మ చాలా బాగా చర్చించేవారు.

గత చిత్రం 'మిలి' అనుకున్న ఫలితాన్నిచ్చిందా? బాలీవుడ్‌ ప్రయాణం ఎలా ఉంది?
ఇప్పుడే నా ప్రయాణం మొదలైంది. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. థియేటర్‌కి వెళుతున్న ప్రేక్షకుల అభిరుచుల్లోనూ, పరిశ్రమలోనూ సమూలమైన మార్పులు చోటు చేసుకుంటున్న సమయం ఇది. 'మిలి' నుంచి ఇంకా ఎక్కువ ఆశించా. ఆ నంబర్లు కనిపించలేదేమో కానీ, ప్రేక్షకుల ప్రేమ, గౌరవం లభించాయి. కథల ఎంపికలో సహజత్వం, నవతరం పోకడలు.. ఈ రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తుంటా.

తెలుగులో ఎప్పుడు నటిస్తారనే ప్రశ్న తరచూ మీకు ఎదురవుతోంది కదా? దానిపై మీ అభిప్రాయం?
నేను కూడా ఎదురు చూస్తున్నా. తొందరలోనే ఆ కోరిక నెరవేరాలని దేవుణ్ని కోరుకుంటున్నా (నవ్వుతూ). హైదరాబాద్‌ అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న సినిమాల చిత్రీకరణలు ఇక్కడ జరుగుతున్నప్పుడు మేం తరచూ వచ్చేవాళ్లం. చాలా సమయం ఇక్కడ గడిపా. మేం ఎప్పుడు హైదరాబాద్‌కు వచ్చినా, తిరిగి వెళ్లేటప్పుడు తిరుపతిలో దిగాల్సిందే. మేం తరచూ సందర్శించే మరో ప్రదేశం.. తిరుపతి. ఆ ప్రాంతంతో నాకు చాలా అనుబంధం ఉంది.

హిందీలోనూ ఈమధ్య దక్షిణాది చిత్రాల ప్రస్తావన ఎక్కువగా వినిపిస్తోంది కదా!
నేను కూడా దక్షిణాది అమ్మాయినే. ఇటువైపు ఘనమైన వారసత్వం ఉంది. నేను కూడా ఈ సంస్కృతిలో భాగమే అని నమ్ముతుంటా. దాంతో అనుకోకుండానే నాలో ఆ ప్రభావం కనిపిస్తుంటుంది. ఉత్తరాదిలో దక్షిణాది చిత్రాలు సాధిస్తున్న విజయాలపై గర్వపడుతున్నా. ఎప్పట్నుంచో ఇక్కడి చిత్రాలు అక్కడ ఆడుతున్నాయి. కానీ ఈమధ్య ఫలితాలు ఇంకా ఘనంగా ఉన్నాయి. దక్షిణాది నుంచి వచ్చిన చిత్రం అంటే కచ్చితంగా వినోదం ఉంటుందని నమ్ముతున్నారు ప్రేక్షకులు. ఆ స్థాయి సినిమాలొస్తున్నాయి. ఇక్కడి పరిశ్రమ ఆ స్థాయి ప్రతిభని ప్రదర్శిస్తోంది. భాష పరంగా హద్దులేవీ లేకుండా సినిమాలు చేయాలనేదే నా లక్ష్యం కూడా.

ఇప్పటిదాకా మీరు చేసిన పాత్రల్లో కష్టంగా అనిపించింది ఏమిటి?
ఇప్పుడు చేస్తున్న'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి' సినిమాలోని పాత్రే. ఈ సినిమా కోసం నేను క్రికెట్‌ నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ క్రమంలో నా భుజానికి గాయమై చాలా ఇబ్బంది పడ్డా. చిత్రీకరణలోనూ చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. లేనిది ఉన్నట్టు మాట్లాడేవాళ్లతో అందరూ విసిగిపోయారు. నేను కూడా అలా ఉంటూ విసిగిపోయా. కొన్నిసార్లు తప్పు అయినా సరే, మన మనసులో ఉన్నదే మాట్లాడాలంటాను. నా మనసులో లేనిది నేనస్సలు చెప్పలేను. ఆ నడవడిక అందరికీ అలవాటైతే మంచిది. తప్పులు చోటు చేసుకున్నా సరే, వాటి నుంచి నేర్చుకోవడం మంచిది కదా!

Last Updated : Nov 27, 2022, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details