తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అనుపమ కొత్త అవతార్​.. త్వరలోనే దర్శకురాలిగా.. కానీ అలా మాత్రం చేయదట - అనుపమ పరమేశ్వరన్‌ పాక్పవలు

అనుపమ పరమేశ్వరన్‌.. కథల్ని ఎంపిక చేసుకోవడంలో ఆమె ప్రత్యేకం. 'కార్తికేయ2'తో విజయాన్ని సొంతం చేసుకున్న అనుపమ.. నిఖిల్​తో కలిసి '18 పేజెస్‌'లో నటించింది. బుధవారం ఈ సినిమా థియేటరల్లోకి రానున్న నేపథ్యంలో ఆమె ముచ్చటించిన విశేషాలు మీకోసం..

Anupama Parameswaran
Anupama Parameswaran

By

Published : Dec 22, 2022, 7:59 AM IST

Updated : Dec 22, 2022, 12:01 PM IST

చేసే ప్రతి పాత్రపైనా వాళ్లదైన ప్రభావం చూపించే కథానాయికలు కొద్దిమంది కనిపిస్తుంటారు. ఆ కొద్దిమందిలో అనుపమ పరమేశ్వరన్‌ ఒకరు. కథల్ని ఎంపిక చేసుకోవడంలోనూ ఆమె ప్రత్యేకం. 'కార్తికేయ2'తో విజయాన్ని సొంతం చేసుకున్న అనుపమ ఇటీవల '18 పేజెస్‌'లో నటించింది. నిఖిల్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం అనుపమ విలేకర్లతో ముచ్చటించారు.

''ప్రేమ లేకుండా ప్రపంచమే లేదు. అదొక అద్భుతమైన భావోద్వేగం. అలాంటప్పుడు ప్రేమకథలు లేకపోతే ఎలా? నా దగ్గరకి తరచూ ప్రేమకథలు వస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ప్రేమకథలు తెరకెక్కుతూనే ఉండాలనేది నా అభిప్రాయం. ఇప్పటివరకు నేను చేసిన ప్రేమకథల్లో '18 పేజెస్‌' చాలా ప్రత్యేకం. ఇందులోని నందిని పాత్ర నాకు అత్యంత ఇష్టమైనది''.

''2020 లాక్‌డౌన్‌ సమయంలోనే దర్శకుడు సూర్యప్రతాప్‌ నాకు ఈ కథ చెప్పారు. సినిమా రెండు గంటలు ఉంటే, దర్శకుడు నాకు కథ మూడున్నర గంటలు చెప్పారు. అప్పటికి నేను 'కార్తికేయ2'కి కూడా సంతకం చేయలేదు. '18 పేజెస్‌', 'కార్తికేయ2' రెండు సినిమాల ప్రయాణం సమాంతరంగా సాగింది. అది సాహసోపేతంగా సాగే కథ అయితే, ఇదేమో ప్రేమకథ. ఇందులో సాహసాలు ఉండవు కానీ, ఆ ప్రేమకథకి ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు. ప్రేమ విషయంలో మన మనసుకు తట్టని ఆలోచనల్ని నందిని పాత్ర లేవనెత్తుతుంది. నాకూ, నందినికీ ఏమాత్రం పోలికలు ఉండవు. కానీ ఇలాంటి అమ్మాయి మన చుట్టూ ఉంటే ఓ ప్రత్యేకమైన ప్రభావం ఉంటుందనేది ఈ సినిమా ప్రయాణంతో బాగా అర్థమైంది''.

ఐదో తరగతినాటి ముక్కుపుడక.. చెవిపోగు
''నందిని పాత్రని డిజైన్‌ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. నవతరం అమ్మాయే కానీ, సామాజిక మాధ్యమాలకి దూరంగా ఉంటుంది. ఇప్పుడు ప్రేమకథలన్నీ సెల్‌ఫోన్‌లో ఓ చిన్న సందేశంతో ముడిపడి ఉంటాయి. కానీ ఇందులోని ప్రేమకథ అలా ఉండదు. లేఖలు, డైరీలు... ఇలా ఉంటుంది ఆ ప్రేమ. అంత ప్రత్యేకం కాబట్టే.. ఈతరం మరింతగా కనెక్ట్‌ అయ్యేలా చేస్తుంది ఆ పాత్ర. నందిని లుక్‌ విషయంలో స్వతహాగా నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నా. ఐదో తరగతిలో నేను పెట్టుకున్న ముక్కు పుడకని, చెవిపోగుని బీరువాలో నుంచి తీసి వేసుకున్నా. నా కెరీర్‌లో ఎక్కువ టేక్‌లు తీసుకుని చేసింది ఈ పాత్ర కోసమే. నటిగా నాకు అంతగా సవాల్‌ విసిరింది. ఈ పాత్ర విషయంలో దర్శకుడు తీసుకున్న చొరవ ఇంకా గొప్పది. ఆయనే చేసుంటే ఈ పాత్ర ఇంకా బాగుండేదేమో (నవ్వుతూ) అనిపించేది. అంత బాగా అర్థం చేసుకుని డిజైన్‌ చేశారు''.

దర్శకత్వానికి ఇంకాస్త సమయం
''దర్శకత్వం ఎప్పుడని అంతా అడుగుతున్నారు. కచ్చితంగా దర్శకత్వం చేస్తా. ఆ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఓ ఏడాది విరామం తీసుకోవాలి. కథానాయికగా నేను ఇంకా నటించాలి కదా? అందుకే ప్రస్తుతం నట ప్రయాణంపైనే దృష్టిపెడుతున్నా. కథల గురించి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కొద్దిమంది అగ్ర దర్శకుల దగ్గర పనిచేసి సాంకేతికంగా మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి. నేను దర్శకత్వం వహించే సినిమాల్లో మాత్రం నటించను''.

''సుకుమార్‌ మార్క్‌ కథ ఇది. ఆయన కథలో నటించడం ఓ గొప్ప అనుభూతి. ఆయన దర్శకత్వం వహించిన 'రంగస్థలం'లో అవకాశాన్ని కోల్పోయినప్పుడు చాలా బాధపడ్డా. అది నాకు దక్కాలని లేదంతే. కొన్నిసార్లు మనం ఎన్ని అనుకున్నా అవి చేయలేం. కొన్నిసార్లు కోరుకోని కథలు, పాత్రలు దగ్గరికొస్తుంటాయి. ప్రయాణంలో అవి సహజం. సుకుమార్‌ రచనలో రూపుదిద్దుకున్న నందిని పాత్ర నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది''.

''విరామం లేకుండా పనిచేస్తూనే ఉన్నా. నా గురించి అభిమానులు రాసే కవితల్ని, నినాదాల్ని విని ఆస్వాదిస్తుంటా. ఎవరు మొదలుపెట్టారో తెలియదు కానీ.. అవి నా కష్టాన్ని మరిచిపోయేలా చేస్తుంటాయి. 'మరీచిక'తోపాటు, తమిళ చిత్రం 'సైరెన్‌' చేస్తున్నా. రవితేజ హీరోగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో 'ఈగిల్‌' చేస్తున్నా. ఇవి కాకుండా ప్రకటించని సినిమాలు కొన్ని ఉన్నాయి''.

Last Updated : Dec 22, 2022, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details