Ajay Devgn vs Kichcha Sudeep: హిందీ జాతీయ భాష కాదని ఇటీవల కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలపై దుమారం చెలరేగింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సుదీప్‌కు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేయడం ఇందుకు కారణమైంది. హిందీ దేశ భాష కానప్పుడు.. ప్రాంతీయ భాషలో తీసిన సినిమాలను హిందీలో ఎందుకు విడుదల చేస్తున్నారని అజయ్ దేవగణ్ ట్వీట్ చేశారు. 'హిందీ మన మాతృభాష మాత్రమే కాదు. మన జాతీయ భాష. ఇప్పుడు, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది' అని హిందీలో పేర్కొన్నారు.
Sudeep Hindi language:కాగా, ఈ ట్వీట్‌కు కిచ్చా సుదీప్ రిప్లై ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు వేరు అని, అవి తప్పుగా ప్రచారం అయి ఉంటాయని సుదీప్ అన్నారు. 'నేను ఆ వ్యాఖ్యలు చేయడానికి గల నేపథ్యం వేరు. మీరు ఏదైతే విన్నారని నేను అనుకుంటున్నానో అది వాటి ఉద్దేశం కాదు. ఆ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాన్ని మీరు ప్రత్యక్షంగా కలిసినప్పుడు చెప్తా. ఎవరినైనా బాధపెట్టడమో, వివాదం రాజెయ్యడమో నా ఉద్దేశం కాదు. మీరు హిందీలో పంపిన సందేశాన్ని నేను అర్థం చేసుకున్నా. హిందీపై మాకు ఉన్న అభిమానం, గౌరవం వల్లే ఇది సాధ్యమైంది. కానీ నేను కన్నడలో రిప్లై ఇస్తే పరిస్థితి ఎలా ఉండేది? నేను రెచ్చగొట్టాలని చెప్పడం లేదు. అయినా మనమంతా భారతీయులమే కదా' అని సుదీప్ కౌంటర్ ఇచ్చారు.
Ajay Devgn hindi language:అనంతరం, అజయ్ దేవగణ్ మరో ట్వీట్ చేశారు. దీనిపై వివరణ ఇచ్చినందుకు సుదీప్‌కు ధన్యవాదాలు చెప్పారు. 'ట్రాన్స్‌లేషన్‌లో పొరపాట్ల వల్ల ఏదైనా తప్పుగా ప్రచారమై ఉంటుంది. సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కటేనని నేను భావిస్తుంటా. అన్ని భాషలను మేం గౌరవిస్తాం. అందరూ అలాగే గౌరవించాలని అనుకుంటాం' అని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి ట్వీట్ చేశారు సుదీప్. 'ట్రాన్స్లేషన్లు, వివరణలు మన ఆలోచన తీరులోనే ఉంటాయి. అందుకే విషయం పూర్తిగా తెలుసుకోకుండా రియాక్ట్ అవ్వడం మంచిది కాదు. నేను మీపై నిందలు వేయట్లేదు. కానీ, మంచి విషయాల్లో మీ నుంచి ట్వీట్ వచ్చి ఉంటే నేను అభినందించేవాడిని. మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం' అని సుదీప్ తెలిపారు.