తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నా మనసులో రవితేజకు ఎప్పటికీ ప్రత్యేక స్థానమే.. ఆయన నన్ను చాలా నమ్మారు' - actor vishnu vishal matti kusti release date

తమిళంలో అంచెలంచెలుగా ఎదుగుతున్న హీరో​ విష్ణు విశాల్​. 'అరణ్య'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన తన లేటెస్ట్​ మూవీ 'మట్టి కుస్తీ' గురించి కొన్ని కబుర్లు చెప్పారు. అవి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

actor vishnu vishal interview
vishnu vishal

By

Published : Nov 27, 2022, 7:46 AM IST

Hero Vishnu Vishal Interview: ఒకొక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్న కథానాయకుడు.. విష్ణు విశాల్‌. గుత్తా జ్వాలను వివాహం చేసుకున్న ఆయన.. తెలుగులో రానాతో కలిసి 'అరణ్య' చిత్రంతో సందడి చేశారు. ఆ తర్వాత 'ఎఫ్‌.ఐ.ఆర్‌'. ఇప్పుడు 'మట్టి కుస్తీ'. చెల్లా అయ్యవు దర్శకత్వం వహించిన 'మట్టి కుస్తీ' డిసెంబరు 2న రానుంది. హీరో రవితేజతో కలిసి స్వయంగా నిర్మించారు విష్ణు విశాల్‌. ఈ సందర్భంగా ఆయన శనివారం ముచ్చటించారు.

''పేరు చూసి ఇది ఆట నేపథ్యంలో సాగే సినిమానా అని అడిగారు చాలామంది. నేను తమిళంలో క్రికెట్‌, కబడ్డీ నేపథ్యంలో సినిమాలు చేయడం కూడా అందుకు ఓ కారణం. ఇది హాస్యం ప్రధానంగా సాగే భార్యాభర్తల ప్రేమకథ. నా కెరీర్‌లో నేను చేసిన తొలి మాస్‌ మసాలా సినిమా ఇదే. కథానాయిక కేరళ అమ్మాయి. అక్కడ మట్టి కుస్తీ అనే ఓ ఆట ఉంది. ఆ ఆటతో భార్యాభర్తల కథను ముడిపెట్టాం. ఇంకా ఈ సినిమాలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి.

కథలో భాగంగా వచ్చే వాటన్నిటినీ తెరపై చూస్తేనే మజా. ట్రైలర్‌లో చూపించని విషయాలు సినిమాలో చాలా ఉంటాయి. నా కెరీర్‌లో ఓ ట్రైలర్‌ని కట్‌ చేయడానికి నెలల సమయం పట్టింది ఈ సినిమాకే. 'వెయ్యి అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమని చెప్పారు, కానీ రెండు అబ్ధాలు ఆడి ఈ పెళ్లి చేశాం' అనే సంభాషణ ఇందులో ఉంటుంది. ఆ రెండు అబద్ధాలు ఏమిటనేది కూడా కీలకం. భార్యాభర్తల మధ్య అహం, దాంతో వచ్చే సమస్యల్ని వినోదాత్మకంగా చర్చించాం. ఆడవాళ్లు ఎప్పుడూ మన నియంత్రణలో ఉండాలని మగాళ్లు భావిస్తుంటారు. ఆ అంశంపై ఓ మంచి సందేశం కూడా ఉంది. సున్నితమైన భావోద్వేగాలు, కడుపుబ్బా నవ్వించే హాస్యం, అందరికీ చేరువయ్యే కథ, కథనాలున్న చిత్రమిది''.

అభ్యంతరకరమైతే తిరస్కరిస్తుంటా
''సమాజంపై సినిమా ప్రభావం చాలా ఉంటుందని నమ్మే వ్యక్తిని నేను. ప్రేక్షకుడిని తప్పు దారి పట్టించేలా ఏ చిన్న విషయం కూడా ఉండకూడదని భావిస్తుంటా. నా దగ్గరికొచ్చే కొన్ని కథలు చేస్తే తప్పకుండా విజయవంతం అవుతాయని ముందే తెలుసు. కానీ ఆ కథల్లో ఎక్కడో ఒక చోట అభ్యంతరకమైన విషయాలు, పెద్దలకి మాత్రమే పరిమితమయ్యే విషయాలు ఉంటాయి. అందుకే మొహమాటం లేకుండా వాటిని తిరస్కరిస్తుంటా. ఆచితూచి కథల్ని ఎంపిక చేసుకుంటూ ఏడాదికి ఒక్కటే సినిమా చేస్తుంటా. సినిమాల్లో సందేశం ఉండొచ్చు కానీ, అది హిత బోధలా ఉండకూడదు. ఈ సినిమాలో కూడా సందేశం ఉంది. కానీ దాన్ని హాస్య ప్రధానంగానే చెప్పాం. తెలుగు నటులు అజయ్‌, శత్రుతోపాటు, మనీష్‌కాంత్‌, కరుణ కింగ్‌స్లే తదితరులు కీలక పాత్రలు పోషించారు''.

అన్ని పరిశ్రమలు ప్రభావం చూపిస్తున్నాయి
''దక్షిణాదిలో నాలుగు పరిశ్రమల నుంచి గొప్ప చిత్రాలొస్తున్నాయి. అన్ని భాషల మధ్య ఆరోగ్య కరమైన పోటీ ఉంది. ప్రతి పరిశ్రమకీ ఒక ప్రత్యేకత ఉంది. 'బాహుబలి'తో తెలుగు సినిమానే మొదట ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 'కేజీఎఫ్‌', 'కాంతార' సినిమాలతో కన్నడ, 'విక్రమ్‌', 'పీఎస్‌1'తో తమిళం.. ఇలాలా అన్ని పరిశ్రమలూ ప్రభావం చూపిస్తున్నాయి. మొదట్లో నేను కంటెంట్‌ ప్రధానమైన సినిమాలే చేసేవాణ్ని. 'రాత్ససన్‌' నా ప్రయాణాన్ని మార్చింది. వాణిజ్య ప్రధానంగా కథల్ని చెప్పాలని నిర్ణయం తీసుకునేలా చేసింది. మలయాళం శైలి కథలు, తెలుగు సినిమాల శైలిలో వాణిజ్యాంశాలు, తమిళ చిత్రాల్లాగా సెన్సిబిలిటీస్‌ని మేళవించి సినిమాలు చేయాలనేదే నా ముందున్న లక్ష్యం. నా నుంచి రాబోయే చిత్రాలన్నీ అదే తరహాలో ఉంటాయి''.

రజనీకాంత్‌ 'లాల్‌ సలామ్‌'లో నటిస్తున్నా
''నా భార్య జ్వాలకు నటనపై ఆసక్తి లేదు కానీ, తనకి సినిమా అంటే చాలా ఇష్టం. సినిమా చూసి తన అభిప్రాయాన్ని పక్కాగా చెబుతుంది. గత మూడు చిత్రాలు ఆమె చెప్పినట్టే ఆడాయి. తదుపరి 'మోహన్‌ దాస్‌' అనే సినిమా చేస్తున్నా. ఆ తర్వాత సత్యజ్యోతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. రజనీకాంత్‌తో కలిసి 'లాల్‌సలామ్‌' చిత్రంలోనూ నటిస్తున్నా. స్వతహాగా నేను క్రికెటర్‌ని. క్రికెట్‌ నేపథ్యంలో సినిమాలంటే చాలా ఇష్టం. ఇప్పటికే 'జీవా' అనే చిత్రం చేశా. పక్కాగా ఓ సూపర్‌హీరో సినిమా చేయాలని ఉంది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా''.

ఆయన తెలుగులో నేనే నటిస్తా అన్నారు
''నా గత చిత్రం 'ఎఫ్‌.ఐ.ఆర్‌' నుంచి రవితేజతో నా ప్రయాణం కొనసాగుతోంది. ఆ కథ నచ్చి విడుదలకు ముందు సమర్పకులుగా ఆ ప్రాజెక్ట్‌లో చేరారు. ఆ సమయంలోనే తర్వాతేమిటని అడిగారు. అప్పుడే 'మట్టి కుస్తీ' గురించి చెప్పా. చాలా బాగుందని నిర్మాణంలో భాగమయ్యేందుకు ముందుకొచ్చారు. ఆ తర్వాత దర్శకుడిని పంపించా.

కథ విన్నాక నన్ను పిలిచి, 'నాకొక ఆలోచన వచ్చింది. నువ్వు ఈ కథని తమిళంలో చేయి, నేను తెలుగులో చేస్తా' అన్నారు. లేదు సర్‌, మీరు ఈ సినిమాకి నిర్మాత మాత్రమే అని చెప్పా. నిజానికి ఆయన కామెడీ టైమింగ్‌కు ఈ కథ చాలా బాగుంటుంది. 13 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నా. ఏదైనా ఒక సినిమా చేసే ముందు నా మార్కెట్‌, వ్యాపారం గురించి మాట్లాడాకే మిగతా విషయాలు ప్రస్తావనకొచ్చేవి. మార్కెట్‌కు తగ్గట్టే ఖర్చు పెట్టేందుకు ముందుకొచ్చేవాళ్లు. రవితేజ మాత్రం నన్ను పరిపూర్ణంగా నమ్మారు. ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకో అని చెప్పేవారు. ఆయనకు నాపైన ఉన్న నమ్మకం నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. రవితేజకు నా మనసులో ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది''.

ABOUT THE AUTHOR

...view details