ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్‌కు గుండెపోటు వచ్చిందన్న వార్తల్లో నిజం లేదని చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నందునే ఆయన హాస్పిటల్‌కు వచ్చారని చెబుతూ శుక్రవారం సాయంత్రం మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. వైద్యులు విక్రమ్‌ను పరీక్షించి, అవసరమైన చికిత్స చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, త్వరలోనే ఆయన్ను డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు కావేరి ఆస్పత్రి సహవ్యవస్థాపకులు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్.
ఆ వార్తలన్నీ అసత్యం!: విక్రమ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు శుక్రవారం మధ్యాహ్నం వార్తలు వచ్చాయి. ఆయనకు గుండెపోటు వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదని విక్రమ్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. "విక్రమ్‌కు ఛాతిలో కాస్త ఇబ్బందిగా అనిపించింది. చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు గుండెపోటు వచ్చిందన్న వార్తలు అవాస్తవం. ఈ వదంతులు వినడం చాలా బాధ కలిగించింది. విక్రమ్ బాగున్నారు. ఒక రోజులో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముంది" అని అన్నారు విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణన్.