Actor Vijay Raghavendra Wife Dead : కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం స్పందన బ్యాంకాక్‌లో ఉన్నారు. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి ఆమె.. వెకేషన్కువెళ్లారు. అయితే ఆదివారం రాత్రి స్పందనకు గుండెపోటు రావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. స్పందన మరణవార్త తెలిసిన వెంటనే.. కుటుంబ సభ్యులు ఇప్పటికే బ్యాంకాక్ బయలుదేరారు. స్పందన భౌతికకాయాన్ని మంగళవారం.. స్వగ్రామానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. స్పందన మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
సీఎం సిద్ధరామయ్య సంతాపం..
Vijay Raghavendra Wife Death : "ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన అకాల మరణ వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. విజయ్ రాఘవేంద్ర, బీకే శివరామ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.
డీకే శివకుమార్ సంతాపం..
Vijay Raghavendra Wife Passes Away : "ప్రసిద్ధ కన్నడ నటుడు శ్రీ విజయ రాఘవేంద్ర గారి ధర్మపత్ని శ్రీమతి స్పందన రాఘవేంద్ర ఆకస్మిక మరణ వార్త తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఆమె ఇటీవల నన్ను కలుసుకుని నాకు శుభాకాంక్షలు తెలిపారు. స్పందన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి" అని డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
"నటుడు విజయ్ రాఘవేంద్ర ధర్మపత్ని స్పందన గుండెపోటుతో మృతి చెందిందన్న వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. చాలా చిన్న వయసులో పలువురు గుండెపోటుకు గురైన ఘటనలు నా మనసును కలవరపెడుతున్నాయి. స్పందన మరణం ఊహించనిది. ఊహించనిది" అని ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు ట్వీట్ చేశారు.
వివాహ వార్షికోత్సవానికి మరో19 రోజుల ముందు ఇలా..
Actor Vijay Raghavendra Spandana : విజయ రాఘవేంద్ర- స్పందన ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2007 ఆగస్టు 26న వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి 16వ వివాహ వార్షికోత్సవానికి మరో19 రోజుల ముందు ఈ విషాదం జరిగింది. రిటైర్డ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ బీకే శివరామ్ కుమార్తె స్పందన. విజయ్ రాఘవేంద్ర కన్నడ సినిమాల్లో నటుడిగా, దర్శకుడిగా కొనసాగుతున్నారు. 2016లో విడుదలైన అపూర్వ సినిమాలో స్పందన.. అతిథి పాత్రలో నటించారు.