సూపర్ స్టార్ కృష్ణ మృతితో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. సుమారు 350 వందలకు పైగా చిత్రాలు చేసి వైవిధ్య పాత్రలతో అలరించిన ఆయన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ చెరగని ముద్ర వేశారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హిట్స్ అందించిన ఈ తార తన జీవితంలో ఎన్నో విజయాలను, రికార్డులను సొంతం చేసుకున్నారు. కానీ ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూశారు.
గౌతమ్‌తో కలిసి సినిమాలో..
'వన్ నేనొక్కడినే' మూవీతో కృష్ణ మనవడు గౌతమ్ కృష్ణ వెండితెరకు పరిచయం అయ్యాడు. తన మనవడితో నటించాలనుందని ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో, మూవీ విడుదల తర్వాత కూడా పలు సందర్భాల్లో అన్నారు. కానీ అది కుదరలేదు. మంచి కథ వస్తే మహేశ్‌తో కలిసి మరో సినిమాలో నటించాలనుకున్నారు. ఆ కోరిక కూడా తీరలేదు. అయితే కృష్ణ తన కుమారులు మహేశ్, రమేశ్ బాబుతో కలిసి పలు చిత్రాల్లో నటించారు.
మహేశ్‌ను జేమ్స్ బాండ్‌గా చూడాలనుకున్నారు..
తెలుగు తెరకు జెమ్స్‌బాండ్ తరహా పాత్రని పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్కే సొంతం. 'గూఢచారి 116', 'రహస్య గూఢచారి' వంటి చిత్రాల్లో నటించి ఆంధ్రా జేమ్స్ బాండ్‌గా గుర్తింపు పొందారు. తనలానే కుమారుడు మహేశ్‌ను కూడా జేమ్స్ బాండ్ పాత్రలో కనిపిస్తే చూడాలనుకున్నారు. ఇదే విషయాన్ని పలు ఇంటర్య్వూలో ఆయన పేర్కొన్నారు. మహేశ్‌ను ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటున్నారంటూ ఓ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు జేమ్స్‌బాండ్ అని ఆయన సమాధానం ఇచ్చారు. దాంతో మహేశ్‌ను జేమ్స్‌బాండ్‌గా చూడాలనే కృష్ణ కోరిక తీరకుండానే మిగిలిపోయింది. కాగా మహేశ్-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో మహేశ్ జేమ్స్‌బాండ్ తరహా పాత్రలో చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదే నిజమైతే కృష్ణ కోరిక తీరినట్టే.. కానీ తెరపై మహేశ్‌ను జేమ్స్‌బాండ్‌గా చూసి మురిసిపోవాలనుకున్న ఆ ఆశ మాత్రం అలాగే ఉండిపోయింది.