Fahadh Faasil Dhoomam :'కేజీఎఫ్' సిరీస్ చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థలోనే ప్రభాస్ 'సలార్' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సంస్థ 'ధూమం' అనే మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఇందులో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించనున్నారు. 'యూ టర్న్' ఫేమ్ పవన్ కుమార్ తెరకెక్కించనున్నారు. అపర్ణ బాలమురళి కథానాయిక. ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను శుక్రవారం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. వినూత్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం.. ఈనెల 9న సెట్స్‌పైకి వెళ్లనుంది. దీన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
సత్యదేవ్ మల్టీస్టారర్ షురూ
సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఓ మల్టీస్టారర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. బాల సుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ సినిమా.. శుక్రవారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది చిత్ర బృందం. "విభిన్నమైన క్రైమ్ యాక్షన్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. సత్యదేవ్, ధనంజయ శక్తిమంతమైన పాత్రల్లో కనిపిస్తారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం" అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: చరణ్ రాజ్, కూర్పు: అనిల్ క్రిష్, ఛాయాగ్రహణం: మణికంఠన్ కృష్ణమాచారి.
ల్యూక్ ఆంటోని వస్తున్నాడు
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన సైకలాజికల్ యాక్షన్ చిత్రం 'రాస్‌చాక్'. ప్రతీకార థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాని ఈ నెల 7న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్‌ని పంచుకుంది. ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. నిషమ్ బషీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ల్యూక్ ఆంటోని అనే పాత్రలో మమ్ముట్టి నటించారు. అఖిల్ చిత్రం 'ఏజెంట్'లో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు మమ్ముట్టి.