Actor Krishnam Raju Political Career : రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగానే సినీజీవితాన్ని ప్రారంభించినా.. ఆ తర్వాత విలన్ పాత్రలే ఎక్కువ చేశారు. తన తొలి చిత్రం 'చిలకా గోరింకా' ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం వల్ల కొంత నిరాశకులోనైన ఆయన.. కథానాయకుడిగా కాకుండా నటుడిగా నిరూపించుకోవాలని నిశ్చయించుకున్నారు. దీంతో అందుకు తగిన విధంగా తనను తాను మలచుకున్నారు. పరిశ్రమలో హీరో వేషాలు వాటంతటవే వస్తాయనే నిశ్చితాభిప్రాయంతో నటనలో తర్ఫీదు తీసుకుని పరిశ్రమలో నిలబడేందుకు ప్రయత్నించారు.
అలానే ఆయన ఊహించిన విధంగానే జరిగింది. తొలి చిత్రం తర్వాత ఆయనకు అన్నీ ప్రతినాయకుని వేషాలే వచ్చాయి. విలన్‌గా తొలిసారి 'అవే కళ్లు' చిత్రంలో నటించిన ఆయన దాదాపు ముప్పై చిత్రాల వరకు ప్రతినాయకుని పాత్రల్లోనే తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. విలనిజంలోనూ ప్రత్యేకతను చాటిన కృష్ణంరాజు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు హీరోలుగా చేసిన చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో మెప్పించారు. ఆ తర్వాత సపోర్టింగ్ హీరో అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఈ ప్రయాణంలోనే ఆయన మళ్లీ హీరోగా మారి వరుసగా చిత్రాలు చేసి విశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నారు.
అనంతరం రాజకీయాల్లో ప్రవేశించిన కృష్ణంరాజు.. అక్కడ కూడా పరాజయంతోనే తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1992లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తిరిగి సినిమాలపై దృష్టి పెట్టారు. ఆరేళ్ల విరామం తర్వాత 1998లో భారతీయ జనతా పార్టీలో చేరి.. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టారు.