Actor Krishnam Raju Passed Away : తెలుగు సినీరంగంలో ఆయనో రెబెల్ స్టార్.... హీరోగా సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ తర్వాత కొన్ని చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలతో అలరించారు. వరసగా విలన్ చిత్రాలు చేసిన ఆయన కొద్ది కాలంలోనే మళ్లీ హీరోగా పుంజుకున్నారు. ఆయనే శ్రీ ఉప్పలపాటి చినవెంకట కృష్ణంరాజు.. ఇంటిపేరులోని శ్రీని పేరులోని చినవెంకట పదాలను తొలగించుకొని కృష్ణంరాజుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆయన 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉన్నత కుటుంబంలో పుట్టారు. చదువు పూర్తి కాగానే జర్నలిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించారు.
సినీరంగంలో ఐదు దశాబ్దాలు..
ఫోటోగ్రఫీపై ఉన్న మక్కువతో హైదరాబాదులో రాయల్ స్టూడియో మొదలుపెట్టారు. ఆ తర్వాత మిత్రుల ప్రోత్సాహంతో సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మద్రాసు చేరుకున్నారు. ప్రముక దర్శకుడు ప్రత్యగాత్మ చేయూతనందించగా ఐదు దశాబ్దాలు సినీరంగంలో ప్రయాణించారు. తెలుగు సినీరంగంలో ఎన్టీఆర్, అక్కినేని తర్వాత రెండో తరం వచ్చిన హీరోల్లో కృష్ణంరాజు ఒకరు. శోభన్‌బాబు, కృష్ణ వెండితెరకు పరిచయం అయినా కొన్నాళ్లకే 1966లో వచ్చిన చిలకా గోరింకా చిత్రంతో కృష్ణంరాజు.. వెండితెరకు హీరోగా పరిచయం అయ్యారు. అయితే తొలిచిత్రం ఆయనకు నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చాలా నిరాశ పడ్డారు. ఫ్లాప్‌తో ఆయనకు ఏమీ సంబంధం లేదని మిత్రులు, దర్శక నిర్మాతలు సర్దిచెప్పినా ఆయన సమాధాన పడలేదు. నటనను మెరుగుపరచుకునేందుకు తనకు తానే శిక్ష విధించుకున్నారు. నటనలో రాటు దేలేందుకు ప్రముఖులు రాసిన పుస్తకాలు చదివారు. పాతకాలం నటుడు సీహెచ్ నారాయణరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. నటనలో పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేవరకు ఎన్ని అవకాశాలు వచ్చినా వదులుకున్నారు. ఇది ఆయనలోని నిబద్ధతను పరిశ్రమకు చాటింది. తర్వాత డొండీ నిర్మాణ సారథ్యంలో.. అవేకళ్లు చిత్రంలో విలన్‌గా అలరించారు. ఆ చిత్రంలో విలన్ పాత్రలో ఆయన నటనకు విమర్శకుల నుంచీ కూడా ప్రశంసలు అందుకున్నారు. అప్పటికే ప్రఖ్యాత విలన్ ఆర్ నాగేశ్వరరావు చనిపోవడంతో అంతా ఆయన్ను మరో ఆర్ నాగేశ్వరరావు తెలుగు తెరకు వచ్చారన్నారు.
'అవే కళ్లు' చిత్రంలో విలన్‌గా మంచి గుర్తింపు..
'అవే కళ్లు' చిత్రంలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు.. తర్వాత వరుసగా 30 సినిమాల్లో విలన్ వేషాలే వేశారు. అయితే విలనిజంలో కూడా ప్రత్యేకత ఉంటేనే చేస్తానని కరాఖండిగా చేప్పేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణ చిత్రాల్లో విలక్షణమైన ప్రతినాయకుడి పాత్రలు పోషించి యంగ్ విలన్‌గా పేరు తెచ్చుకున్నారు. విలన్ వేషాల తర్వాత పలు చిత్రాల్లో హీరో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా లభించాయి ఆయనకు ఎన్టీఆర్‌తో 'భలేమాస్టార్', 'బడిపంతులు', 'వాడేవీడు', 'పల్లెటూరి చిన్నోడు', 'మనుషుల్లో దేవుడు', 'మంచికి మరోపేరు', 'సతీసావిత్రి' చిత్రాల్లో నటించారు.
అక్కినేని కాంబినేషన్లో బుద్ధిమంతుడు, జైజవాన్, పవిత్రబంధం, మంచిరోజులు వచ్చాయి, మాతృమూర్తి చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. ఏఎన్నార్ హీరోగా తెరకెక్కిన 'ఎస్పీ భయంకర్' చిత్రంలో సపోర్టింగ్ హీరోగా నటించారు. హీరో కృష్ణ కాంబినేషన్లో 17 చిత్రాల్లో హీరోగా నటించారు కృష్ణంరాజు. శోభన్‌బాబుతో బంగారు తల్లి, మానవుడు దానవుడు, జీవనతరంగాలు చిత్రాల్లో విలన్‌గా నటించారు. ఇద్దరు ఇద్దరే, కురుక్షేత్రం, రామబాణం, జీవితం చిత్రాల్లో సపోర్టింగ్‌గా నటించారు.
ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన ఇంటిదొంగలు చిత్రంతో కృష్ణంరాజు..మళ్లీ హీరోగా మారారు. అయితే ఆ చిత్రం లేడీ ఓరియంటెడ్ అయినప్పటికీ ప్రత్యగాత్మతో ఉన్న అనుబంధం కారణంగా ఒప్పుకున్నారు. విలన్‌గా వెలుగొందుతున్న రోజుల్లోనే గోపికృష్ణా మూవీస్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి వరుసగా చిత్రాలు నిర్మించారు. స్వంత బ్యానర్లో వచ్చిన తొలి చిత్రం కృష్ణవేణి.. పన్నెండు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ చిత్రంతో ఆయన హీరోగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుసగా బయటి నిర్మాణ సంస్థల నుంచి హీరోగా అవకాశాలు రావడంతో బిజీగా మారిపోయారు.