తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అశ్రునయనాల మధ్య అధికార లాంఛనాలతో రెబల్​స్టార్​కు అంతిమవీడ్కోలు - Krishnam raju funeral

Actor Krishnamraju died: సినీ దిగ్గజం, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు అంత్యక్రియలు.. మొయినాబాద్‌ మండలం కనకమామిడిలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు వందలమంది అభిమానులు, చలనచిత్ర ప్రముఖులు తరలివచ్చారు. కృష్ణంరాజు భౌతికకాయానికి కన్నీటి నివాళి అర్పించారు.

krishnam raju cremations
కృష్ణంరాజు అంత్యక్రియలు

By

Published : Sep 12, 2022, 3:52 PM IST

Updated : Sep 12, 2022, 6:17 PM IST

Actor Krishnamraju died: ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు తుదిశ్వాస విడివడంతో ఆయన అభిమానులతో పాటు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం ఉదయం కృష్ణంరాజు కన్నుమూయగా.. సోమవారం మధ్యాహ్నం వందల మంది అభిమానుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం కనకమామిడిలోని ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కృష్ణంరాజు అంతిమయాత్ర పటిష్ఠ బందోబస్తుతో అప్పా జంక్షన్‌ మీదుగా మొయినాబాద్‌లోని కనకమాడిలోని ఫామ్‌హౌజ్‌లో వరకు సాగింది. తమ అభిమాన నటుడిని చివరిసారి చూసుకునేందుకు ఈ అంతిమయాత్రలో వందలమంది అభిమానులు పాల్గొన్నారు. దహన సంస్కారాలకు హాజరయ్యారు. అధికారిక లాంఛనాల్లో భాగంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆయనకు గన్‌ సెల్యూట్‌ చేశారు. అంత్యక్రియలకు అనుమతి ఉన్నవారిని మాత్రమే ఫాంహౌస్‌ లోపలికి పోలీసులు అనుమతించారు. భద్రతా ఏర్పాట్లను శంషాబాద్‌ డీసీపీ పర్యవేక్షించారు.

కృష్ణంరాజు పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు తరలివచ్చిన అభిమానులు
సెల్యూట్​ చేస్తున్న పోలీసులు
రోదిస్తున్న భార్య శ్యామలదేవీ
రోదిస్తున్న కృష్ణంరాజు భార్య

పార్థివదేహాన్ని భుజాలపై మోసిన శ్యామలాదేవి.. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి కృష్ణంరాజు పార్థివదేహాన్ని ఫామ్‌హౌజ్‌కు తరలించేముందు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కన్నీటి పర్యంతమైన దృశ్యాలు కలిచివేస్తున్నాయి. శ్యామలాదేవి తన భర్త పార్థివదేహాన్ని స్వయంగా తన భుజాలపై మోసి వాహనం వరకు తీసుకెళ్లిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

పార్థివదేహాన్ని భుజాలపై మోసిన శ్యామలాదేవి
ప్రభాస్​

ప్రముఖుల సంతాపం.. కృష్ణంరాజు మృతికి ప్రధాని మోదీ, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్‌, జగన్‌ సహా పలువురు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఇకలేరన్న సంగతి తెలియగానే టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి వచ్చి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కృష్ణంరాజు భార్య, ప్రభాస్‌ను ఓదార్చి తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వీరిలో మెగాస్టార్​ చిరంజీవి, పవర్​స్టార్ పవన్​కల్యాణ్​, మంచు మోహన్​బాబు, రాజేంద్ర ప్రసాద్​, మహేశ్​బాబు, ఎన్టీఆర్​, మంచు విష్ణు, సినీ నటి జయప్రద, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, కేటీఆర్​, ఏపీ మంత్రులు ఆర్కే రోజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్‌, ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి ఇంకా పలువురు ఉన్నారు.

కృష్ణంరాజు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి

ఆదివారం వేకువజామున.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.16 గంటల సమయంలో తుదిశ్వాస విడిశారు. కొంతకాలంగా మధుమేహం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (సీవోపీడీ)తోపాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏడాది కిందట మధుమేహం కారణంగా ఆయన పాదం కూడా తొలగించారు. ఇటీవల కొవిడ్‌ సోకడంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కోలుకొని ఇంటికి చేరుకున్నా.. పోస్టు కొవిడ్‌ సమస్యలు తలెత్తాయి. ఆగస్టు 5న తీవ్ర ఆయాసంతో మళ్లీ ఏఐజీలో చేరారు. గత 27 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

కరోనరీ హార్ట్‌ డిసీజ్‌, క్రానిక్‌ హార్ట్‌ రిథమ్‌ డిజార్డర్‌, పంపింగ్‌ ఒకదాని వెనుక ఒకటి ఆయనపై కోలుకోలేని విధంగా దాడి చేశాయి. బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లతో తీవ్ర న్యుమోనియా కూడా రావడంతో శనివారం రాత్రి నుంచి ఆరోగ్యం మరింత విషమించింది. మూత్రపిండాల పనితీరు పూర్తిగా దిగజారింది. చివరికి కార్డియాక్‌ అరెస్టుకు గురయ్యారు. వైద్యులు సీపీఆర్‌ ప్రక్రియతో కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

ఇవీ చూడండి..:

కృష్ణంరాజు మొత్తం ఆస్తి విలువ అన్ని కోట్లా?

ఎన్టీఆర్​ను అలా చూడటమంటే కృష్ణంరాజుకు చాలా ఇష్టమట

ప్రభాస్ విషయంలో కృష్ణంరాజుకు అదొక్కటే అసంతృప్తి.. ఆ కల నెరవేరకుండానే..

Last Updated : Sep 12, 2022, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details