'నటనంటే ఆయనే.. ఆయనే నటుడంటే' అని కొన్ని కోట్లమంది ప్రేక్షకులతో అనిపించుకున్నారు నటుడు కమల్ హాసన్. ఆయనకు యాక్షన్.. అనడమే తరువాయి.. వెంటనే పాత్రలో పరకాయప్రవేశం చేసి లీనమైపోతారు. భిన్నమైన పాత్రలు పోషించి యూనివర్సల్ స్టార్‌గా ఎదిగారు. అయితే కమల్ తన తొలి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా? తొలిసారి ఏ పాత్రలో పోషించారో తెలుసా? ఆ సంగతులే ఈ కథనం
కమల్‌హాసన్.. మూడేన్నరేళ్ల వయసులో ఓ పార్టీకి వెళ్లారు. అదే వేడుకలో ఉన్న ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఏవీఎం చెట్టియార్ దృష్టి కమల్‌పై పడింది. 'ఈ బాలుడు ఎవరో చాలా బాగున్నాడు' అనుకుంటూ వివరాలు తెలుసుకుని, తాను నిర్మించిన 'కలాతూర్ కన్నమ్మ' (తమిళం) అనే చిత్రంలో కమల్‌కు అవకాశం ఇచ్చారు. అలా చిన్నప్పుడే ముఖానికి రంగేసుకుని కెమెరా ముందు నిల్చొన్నారు కమల్. ఆయన పోషించిన పాత్రను డైసీ ఇరానీ (ప్రముఖ నటి.. బాల నటిగానూ విశేష గుర్తింపు పొందారు) నటించాల్సింది. కానీ, కమల్‌కు ఫిదా అయినా చెట్టియార్ ఆయన్నే ఎంపిక చేసుకున్నారు. ఆ పాత్రలో నటించినందుకు కమల్ అందుకున్న పారితోషికం రూ. 2 వేలు. ఆ రోజుల్లో అంతటి రెమ్యునరేషన్ అంటే చాలా గొప్ప. 'మూడున్నరేళ్ల వయసు అంటే మాట్లాడటమే కష్టం. కానీ, నేను 'ఎంత ఇస్తారు? నటిస్తున్నందుకు' అని అడిగా అంటూ ఓ ఇంటర్వ్యూలో కమల్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.