టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ (82) కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత - నటుడు చంద్రమోహన్ మూవీస్ లిస్ట్
Published : Nov 11, 2023, 10:21 AM IST
|Updated : Nov 11, 2023, 11:26 AM IST
10:20 November 11
actor chandramohan death
కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. 1966లో 'రంగుల రాట్నం' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన 6 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో 600కిపైగా చిత్రాల్లో నటించి ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు.
తెలుగుతో పాటు పలు తమిళ సినిమాల్లోనూ నటించారు. కెరీర్ తొలుత హీరో క్యారెక్టర్లు చేసిన ఆయన.. ఆ తర్వాత కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన విలక్షణ నటనతో అందరినీ అబ్బురపరిచారు. 'బంగారు పిచుక', 'ఆత్మీయులు', 'తల్లిదండ్రులు', 'బొమ్మబొరుసు', 'సీతామాలక్ష్మి', 'శంకరాభరణం','తాయారమ్మ బంగారయ్య','ఇంటింటి రామాయణం', 'కొరికలే గుర్రాలైతే', 'మంగళ తోరణాలు' 'కొత్తనీరు', 'సంతోషిమాత వ్రతం', 'మూడు ముళ్లు', 'చంటబ్బాయ్', 'శ్రీ షిరిడీ సాయిబాబా మహాత్యం','వివాహ భోజనంబు', 'త్రినేత్రుడు', 'యోగి వేమన', 'ఆదిత్య 369', 'పెద్దరికం', 'గులాబీ', 'రాముడొచ్చాడు','నిన్నే పెళ్లాడతా', 'ప్రేమించుకుందాం రా', 'చంద్రలేఖ', 'అందరూ హీరోలే' లాంటి సినిమాల్లో నటించారు.
సీనియర్ నటీనటులతోనే కాకుండా యంగ్ స్టార్స్‌తోనూ చంద్రమోహన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తన కెరీర్లో ఆయన రెండు ఫిలింఫేర్, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. 'పదహారేళ్ల వయసు', 'సిరి సిరి మువ్వ' సినిమాల్లో ఆయన నటనకుగాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. 2005లో 'అతనొక్కడే' సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 1987లో 'చందమామ రావే' సినిమాకు ఉత్తమ కమెడీయన్‌గా నంది అవార్డు అందుకున్నారు.